గుండె జబ్బు రావొద్దంటే మూడు ఫుడ్స్ పక్కన పెట్టండి

గుండె జబ్బు రావొద్దంటే మూడు ఫుడ్స్ పక్కన పెట్టండి

ప్రపంచంలో హై బీపీ, హైపర్‌ టెన్షన్ 30 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయాయి. వీటి మూలంగానే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ లాంటి జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల వల్లే ఏటా 1.76 కోట్ల మంది పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య మరో పదేళ్లలో (2030 నాటికి) సుమారు రెండున్న కోట్ల మందికి చేరొచ్చని ఓ స్టడీ అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలి. ఇందుకు మూల కారణమైన హై బీపీని కంట్రోల్ చేసుకోవాలి. బీపీ పెరిగిపోవడానికి మన టెన్షన్లు, లైఫ్ స్టైల్ ప్రధాన కారణాలు. యోగా, ప్రశాంత జీవనం అలవాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. బీపీని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని డాక్టర్లు చెబుతుంటారు. పాలు, గుడ్లు, ఆకుకూరలు, క్యారెట్, చేపలు లాంటి మంచి ఆహారం తీసుకోవాలి. పచ్చి కూరలు, ఫ్రూట్స్ రెగ్యులర్‌గా తినాలి. అయితే ముఖ్యంగా మూడు రకాల ఫుడ్స్‌ని దూరంగా పెడితే హైపర్ టెన్షన్, హై బీపీని సులభంగా కంట్రోల్ చేయొచ్చన్నది వైధ్యుల మాట.

హై సాల్టీ ఫుడ్స్

గుండె జబ్బులతో బాధపడే వాళ్లందరికీ డాక్టర్లు చెప్పే మాట.. ఉప్పు తగ్గించండి అని!! సాల్ట్ వీలైనంత తక్కువ తీసుకుంటే అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం ఓ మనిషి రోజుకు రెండు మూడు గ్రాములకు మించి ఉప్పు శరీరంలోకి తీసుకోకూడదు. అంటే సుమారుగా ఒక టీ స్పూన్ అన్నమాట. సో, మనం వండుకునే కూరల్లో అది వచ్చేస్తుంది. కాబట్టి చిప్స్, స్నాక్స్ లాంటివి వీలైనంత తగ్గిస్తే మంచిది.

ప్రాసెస్డ్ ఫుడ్స్

బీపీ ఉన్నా లేకున్నా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంకా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్లు తీసుకుంటే ఇక అంతే సంగతులు. గుండెపై మరితం ఎఫెక్ట్ పడుతుంది. హెవీ ఆయిల్ ఫుడ్స్, చిప్స్, ప్రెంచ్ ఫ్రైస్, గ్రిల్డ్ చికెన్, కేకులు, బేకరీ ఐటమ్స్, నిల్వ ఉంచిన ఊరగాయలు వంటివి తినకపోవడం మంచిది. ఇవి పాడవకుండా ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్, సోడియం, షుగర్ ఎక్కువగా వాడుతారు.

స్వీట్లు, షుగర్

చక్కెర అధికంగా ఉండే పదార్థాలను కూడా గుండె జబ్బు ముప్పు ఉండేవాళ్లు తగ్గించాలి. చాక్లెట్లు, స్వీట్లు బాగా తగ్గించాలి. అలాగే కూల్‌డ్రింక్స్, కాఫీ, టీలు ఎప్పుడో ఒకటీ అరా తప్ప తీసుకోకపోవడం మంచిది. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఇష్టం వచ్చినట్లుగా తింటే బరువు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ వచ్చే ముప్పు ఉంది. వీటి వల్ల గుండెపై ఎఫెక్ట్ పెరుగుతుంది.

ఈ ఫుడ్స్‌ని కంట్రోల్‌గా తీసుకోవడంతో పాటు ప్రశాంతమైన జీవితం అలవాటు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. గంటలు గంటలు కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లకు శారీరక శ్రమ లేకపోతే గుండె జబ్బులు వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. రోజూ కొంత సమయమైనా వాకింగ్ లాంటివి చేయడం అవసరం.