
- కీలక పాత్ర పోషించిన హేమ?
- 13మందిని తీసుకెళ్లినట్టు టాక్
- వాళ్లలో జూనియర్ ఆర్టిస్ట్ లు, సీరియళ్ల నటులు!
- టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కేసు
- ఒక్కొక్కటిగా బయటికి వస్తున్ననిజాలు
- దర్యాప్తు ముమ్మరం చేసిన బెంగళూరు పోలీసులు
హైదరాబాద్: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలోని జీఆర్ ఫాం హౌస్ లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’పేరుతో ఈ పార్టీని నిర్వహించిన లంకపల్లి వాసు విజయవాడకు చెందిన క్రికెట్ బుకీగా గుర్తించారు. వాసు రాజకీయ నాయకులకు బినామీగా క్రికెట్ నుంచి పాలిటిక్స్ వరకు పందాలు నిర్వహిస్తూ కోట్లకు పడగలెత్తాడు. విజయవాడ నగరం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు దందాలు విస్తరించాడు. రేవ్ పార్టీకి వచ్చిన ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల చొప్పన వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫాం హౌస్ పరిధిలోని హెబ్బెగోడి పోలీసు స్టేషన్ అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చారని సమాచారం.
ఈ రేవ్ పార్టీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందని భావిస్తున్న సీసీఎస్ అధికారులు లోతుగా విచారించారు. ఏఎస్సై నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ రేవ్ పార్టీలో మొత్తం 27 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో సుమారు 13 మందిని సినీ నటి హేమ అలియాస్ కృష్ణవేణి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. వాళ్లలో ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు, సీరియళ్లలో నటించే వారు, మోడళ్లు అని సమాచారం. పోలీసులు రంగ ప్రవేశం చేసిన నిమిషాల వ్యవధిలో హేమ అదే ఫాం హౌస్ లో కాస్తా పక్కకు వచ్చి తనను ఎవరూ అరెస్టు చేయలేదని, తాను హైదరాబాద్ లోని ఫాంహౌస్ లో చిల్ అవుతున్నానంటూ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత ఈ కేసులో అనేక మలుపులు తిరిగింది.
హేమ తన పేరును కృష్ణవేణి అని పోలీసులకు తెలుపడంతో ఆ పేరు మీదే ఎఫ్ఐఆర్ అయ్యింది. దీంతో విషయం బయటికి రాలేదు. మరు సటి రోజు బిర్యానీ చేస్తున్నట్టు మరో వీడియో రిలీజ్ చేయడంతో బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమె వీడియో ఎలా రిలీజ్ చేశారనే అంశంపై ఆరా తీశారు. ఈ కేసులో అందరి బ్లడ్ శాంపిల్స్ ను తీసుకున్న పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. హేమతో పాటు మరో నటి అషీరాయ్ కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.