మణిపూర్​లో ముగ్గురి హత్య.. తండ్రీకొడుకు సహా మరో వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

మణిపూర్​లో ముగ్గురి హత్య..  తండ్రీకొడుకు సహా మరో వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

ఇంఫాల్: మణిపూర్​లో మళ్లీ హింస చెలరేగింది. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడిన దుండగులు.. తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటన బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా ప్రాంతంలో జరిగింది. ఘర్షణల కారణంగా ఉఖా తంపక్ గ్రామ ప్రజలు రిలీఫ్ క్యాంపులో ఉంటున్నారు. పరిస్థితులు కాస్త కుదుటపడడంతో శుక్రవారమే ముగ్గురు తమ ఇండ్లకు వచ్చారు. ‘‘శుక్రవారం అర్ధరాత్రి దాటాక దుండగులు గ్రామంలోకి చొరబడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి, కొడుకులతో పాటు పక్కింట్లోని మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత కత్తులతో పొడిచారు” అని పోలీసులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగులు చురాచంద్ పూర్ నుంచి వచ్చారని చెప్పారు. ఈ ఘటన తర్వాత బిష్ణుపూర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడి, చురాచంద్ పూర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక పోలీస్, మరో ఇద్దరు గాయపడ్డారు. ‘‘గాయపడిన ముగ్గురిని ఇంఫాల్​లోని ఆస్పత్రికి తరలించాం. వాళ్లకు ప్రమాదమేం లేదు” అని పోలీసులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారడంతో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో కర్ఫ్యూ టైమింగ్స్ పొడిగించారు. కేవలం ఉదయం 5 గంటల నుంచి 10:30 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపు ఇచ్చారు. మరోవైపు 27 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. 

బఫర్ జోన్​లోకి చొరబడి.. 

బిష్ణుపూర్​లోని క్వాక్టా ఏరియా బఫర్ జోన్​లో ఉంది. కేంద్ర బలగాలు పహారా కాస్తున్నా దుండగులు చొరబడి, ముగ్గురిని చంపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బలగాల నిర్లక్ష్యం వల్లే ముగ్గురు చనిపోయారని సీఎం ఎన్.బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమో సింగ్ మండిపడ్డారు.