పడవలో నుంచి రెస్టారెంట్‎పై కాల్పులు.. అక్కడికక్కడే ముగ్గురు మృతి.. నలుగురికి గాయాలు

పడవలో నుంచి రెస్టారెంట్‎పై కాల్పులు.. అక్కడికక్కడే ముగ్గురు మృతి.. నలుగురికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి నార్త్ కరోలినాలోని ఒక రెస్టారెంట్‌పై దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సముద్ర తీరంలో ఉన్న ఓ రెస్టారెంట్‎పై బోట్‎లో నుంచి కాల్పులు జరిపి అనంతరం దుండగుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు. 

అధికారుల వివరాల ప్రకారం.. విల్మింగ్టన్‌కు దక్షిణంగా దాదాపు 20 మైళ్ల దూరంలో ఉన్న సౌత్‌పోర్ట్ యాచ్ బేసిన్ ప్రాంతంలో అమెరికన్ ఫిష్ కంపెనీ అనే పబ్ అండ్ రెస్టారెంట్‌ ఉంది. ఈ క్రమంలో శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి 9.30 గంటల సమయంలో పడవలో రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన ఓ దుండగుడు.. బోట్‎లో నుంచే రెస్టారెంట్‎పై ఓపెన్ ఫైరింగ్ చేసి పారిపోయాడు. 

దుండగుడి కాల్పుల్లో మొత్తం ఏడుగురు గాయపడగా.. అందులో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.