రాజస్థాన్ లో తొక్కిసలాట... ముగ్గురు మృతి

రాజస్థాన్ లో తొక్కిసలాట... ముగ్గురు మృతి

రాజస్థాన్‌లోని ఓ దేవాలయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్‌ శికర్ జిల్లాలోని ఖతు శ్యామ్‌జీ దేవాలయంలో నెలకొకసారి జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎప్పటిలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారకముందే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం ఐదు గంటలకు దర్శనం మొదలు కాగా... ఈ సందర్భంలోనే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగనట్టు తెలుస్తోంది. దీంతో చాలా మంది భక్తులు కింద పడిపోయారు. ఒకరినొకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని జైపూర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో వైద్యం అవసరమైన వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనపై  ప్రధాని మోడీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అంతే కాకుండా మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.20,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.