పుల్వామా కారు దాడి ప్లాన్‌ చేసిన టెర్రరిస్ట్‌ హతం

పుల్వామా కారు దాడి ప్లాన్‌ చేసిన టెర్రరిస్ట్‌ హతం
  • ఎన్‌కౌంటర్‌‌ చేసిన సెక్యూరిటీ సిబ్బంది
     మరో ఇద్దరు జైషే టెర్రరిస్టులు కూడా

కాశ్మీర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌ పుల్వామా జిల్లాలోని కంగన్‌ ఏరియాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు జైషే మహ్మద్‌ టెర్రరిస్టులు చనిపోయారు. ముగ్గరిలో ఒకరు జైషే టెర్రర్‌‌ గ్రూప్‌ కమాండర్‌‌గా పోలీసులు గుర్తించారు. పుల్వామాలో ఇటీవల ఐఈడీతో నిండిన కారుతో దాడిని ప్లాన్‌ చేసిన కూడా అతనే అని అధికారులు భావిస్తున్నారు. అతడిని సౌత్‌ కాశ్మీర్‌‌కు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ అలియాస్‌ ఫౌజీ లంబూగా గుర్తించామని అన్నారు. లంబూ.. మసూద్‌ అజార్‌‌కు చుట్టమని, ఐఈడీ తయారీలో ఎక్స్‌పర్ట్‌ అని అన్నారు. పోయిన ఏడాది ఫిబ్రవరీలో పుల్వామా ఎటాక్‌కు వాడిన ఐఈడీని, ఈ మధ్య పట్టుకున్న కార్‌‌లోని ఐఈడీని కూడా ఇతనే సమకూర్చినట్లు తెలుస్తోందని సీనియర్‌‌ పోలీస్‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. కంగాన్‌ ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో మిలటరీ, సీఆర్‌‌పీఎఫ్‌ జవాన్లు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి టెర్రరిస్టులను మట్టుబెట్టారని అధికారులు చెప్పారు. టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపామని ఆర్మీ అధికారులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోయిన ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్‌‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా.. ఆ తరహా ఎటాక్‌ను ప్లాన్‌ చేసిన టెర్రరిస్టులు కారులో 42 కేజీల ఐఈడీతో వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది దాన్ని తిప్పికొట్టారు. కారును స్వాధీనం చేసుకుని బ్లాస్ట్‌ చేశారు. ఆ దాడితో సంబంధం ఉన్న టాప్‌ జైషే మహ్మద్‌ టెర్రరిస్టుని కొన్ని రోజుల క్రితమే రాజ్‌పొరాలో సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు.