3 గంటల్లో 30 పేపర్లు దిద్దిస్తున్రు

3 గంటల్లో 30 పేపర్లు దిద్దిస్తున్రు

పొద్దున ఇన్విజిలేషన్.. మధ్యాహ్నం వాల్యూయేషన్
7 గంటల్లో చేయాల్సిన పని 3 గంటల్లో చేయమంటున్రు
గతేడాది తప్పులతోనూ మారని అధికారుల తీరు

హైదరాబాద్, వెలుగు: గతేడాది జరిగిన తప్పుల వల్ల స్టూడెంట్స్ బలైపోయినా, ఇంటర్ బోర్డు అధికారుల తీరులో పెద్దగా మార్పు కన్పిస్తలే. ఈ ఏడాదీ అధికారులు అసొంటి తప్పులే చేస్తున్నారు. ఉదయం ఎగ్జామినేషన్ డ్యూటీ వేసి, వారితోనే మధ్యాహ్నం మళ్లా పేపర్లు దిద్దిస్తున్నరు. అదిగూడా.. 7 గంటల్లో చేయాల్సిన పనిని, 3 గంటల్లో చేయాల్సిందేనని హుకుం జారీచేస్తున్నరు. దీంతో 3 గంటల్లో 30 పేపర్లు దిద్దాల్సి వస్తున్నది. ఇట్ల కష్టపడటం అటుంచితే, మళ్లీ తప్పులొస్తే తమపైనే చర్యలు తీసుకుంటారని లెక్చరర్లంతా పరేషాన్ అయితున్నరు. ఈ నెల 10 నుంచి సంస్కృతం సబ్జెక్ట్ ఆన్సర్ షీట్ల వాల్యూయేషన్ ప్రారంభమైంది. రాష్ర్టవ్యాప్తంగా11 స్పాట్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లోనే నాలుగు సెంటర్లున్నాయి. వీటన్నింటిలో సుమారు 1000 మంది లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది ఉదయం ఇంటర్ ఎగ్జామినేషన్ డ్యూటీలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ విధుల్లోనే ఉంటున్నారు. వారంతా లంచ్ చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకూ స్పాట్ సెంటర్లకు చేరుకుంటున్నారు. మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకూ వాల్యూయేషన్ చేస్తున్నారు.

3 గంటల్లో 30 పేపర్లా..?
నిబంధనల ప్రకారం ప్రతిరోజు ఒక్కో వాల్యూయేటర్ 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. వారంతా ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడు గంటల్లో 30 పేపర్లు దిద్దాలి. కానీ ఉదయం ఇన్విజిలేషన్ డ్యూటీ చేసి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 30 పేపర్లు దిద్దాలని చెప్తున్నారు. దీంతో లెక్చరర్లంతా ఇబ్బందులు పడుతున్నారు. సగం రోజు మాత్రమే వాల్యూయేషన్‌కు వస్తున్నారు కాబట్టి కేవలం15 పేపర్లు మాత్రమే ఇవ్వాలని వారంతా కోరుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకుంటలేరని వాపోతున్నారు. గతంలో తక్కువ టైంలో ఎక్కువ పేపర్లు దిద్దడం వల్లే తప్పులు దొర్లాయి. ఈసారి కూడా అలాగే పేపర్లు దిద్దిస్తున్నారని, దీంతో తప్పులొస్తే మళ్లీ తమపైనే చర్యలు తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏదో ఒక పని నుంచి మినహాయించాలని లేదా రోజుకు15 పేపర్లే దిద్దించాలని అధికారులను కోరుతున్నారు.

తప్పులు చేసిన లెక్చరర్ల తొలగింపు
గతేడాది పేపర్లు దిద్దడంలో తప్పులు చేసిన 1000 మందికి పైగా లెక్చరర్లకు ఇంటర్ బోర్డు ఫైన్ వేసింది. దీంట్లో సంస్కృతం లెక్చరర్లు 40 మంది వరకూ ఉంటారు. వీరందరూ ఫైన్ చెల్లించి, ఈ నెల 10 నుంచి ప్రారంభమైన స్పాట్‌కు హాజరయ్యారు. అయితే ఈ నెల12న సాయంత్రం ఇంటర్ బోర్డు నుంచి గతేడాది తప్పులు చేసిన వారెవరినీ విధుల్లోకి తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో 13న వారిని స్పాట్ డ్యూటీ చేయించలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు. ముందే చెప్పితే, తాము వచ్చేవాళ్లం కాదనీ, కానీ రెండు, మూడు రోజులు పనిచేయించుకున్న తర్వాత విధులకు రావొద్దనడం అవమానించడమేనని వారంతా మండి పడుతున్నారు.