పాలిటెక్నిక్ కాలేజీల్లో 30% సీట్లు ఖాళీ

పాలిటెక్నిక్ కాలేజీల్లో 30% సీట్లు ఖాళీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో దాదాపు 30 శాతం సీట్లు మిగిలిపోయాయి. శుక్రవారం టీఎస్​ పాలిసెట్–2023 ఫైనల్ ఫేజ్ సీట్లు అలాట్మెంట్ చేశారు. మొత్తం 118 కాలేజీల్లో 31,739 సీట్లుంటే, వాటిలో 22,144(69.76%) సీట్లు స్టూడెంట్లకు కేటాయించారు. మరో 9,595 సీట్లు మిగిలిపోయాయి. పాలిసెట్​కు మొత్తం 80,358 మంది క్వాలిఫై అయితే.. ఫైనల్​ ఫేజ్​లో కేవలం 14,136 మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చారు. 56 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 13,494 సీట్లకు 11,336(84%)  సీట్లు అలాట్ కాగా, 62 ప్రైవేటు కాలేజీల్లో 18,245 సీట్లకు 10,808 (59.23%) సీట్లు నిండాయి. స్టేట్​లో మూడు కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. దాంట్లో రెండు సర్కారువి, ఒకటి ప్రైవేటు కాలేజీ ఉంది. సీట్లు అలాటైన అభ్యర్థులు ఈనెల 17లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని, లేకపోతే సీట్లు రద్దవుతాయని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. 

డిప్లొమాలోనూ సీఎస్​ఈ హవా..

ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు పాలిటెక్నిక్ డిప్లొమా కాలేజీల్లోనూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్​ఈ) బ్రాంచ్​కు డిమాండ్ పెరిగింది. మొత్తం 22,144 సీట్లు స్టూడెంట్లకు అలాట్ చేస్తే, దాంట్లో 5,897 సీట్లు సీఎస్​ఈ బ్రాంచ్​వే. ఇందులో కేవలం 833 సీట్లు మాత్రమే మిగిలాయి. ఈసీఈలో 6,010 సీట్లకు 4,965 సీట్లు నిండగా, ఈఈఈలో 6,489 సీట్లకు 4,175 సీట్లు, సివిల్ ఇంజినీరింగ్​లో 4,861 సీట్లకు 2,874 సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్​లో 4,449 సీట్లకు 2,279 సీట్లు స్టూడెంట్లకు అలాట్ చేశారు.