శవాల లెక్క నేడో రేపో తేలిపోద్ది: రాజ్ నాథ్

శవాల లెక్క నేడో రేపో తేలిపోద్ది: రాజ్ నాథ్

ధుబ్రీ (అస్సాం): ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ లో మరణించిన ఉగ్రవాదుల లెక్క చెప్పాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ పై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. పాక్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే టెర్రర్ క్యాంపుపై వాయుసేన దాడి చేసిన సమయంలో అక్కడ 300 ఫోన్లు ఆన్ లో ఉన్నట్లు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) నివేదించిందన్నారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు నమ్మకపోతే ఎలా అని ప్రశ్నించారు రాజ్ నాథ్. అస్సాంలోని ధుబ్రీ ప్రాంతంలో ఆర్మీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

ఐఏఎఫ్ దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో చెప్పాలంటూ కొందరు నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఆ లేక్క నేడో రేపో తేలిపోతుందని చెప్పారాయన. అక్కడ ఎంత మంది చచ్చిపోయారో పాకిస్థాన్ నాయకులకు తెలుసన్నారు.

పాక్ లో దాడి చేసిన తర్వాత మృతదేహాలను వాయుసేన సైనికులు… 1, 2, 3, 4 అంటూ లెక్కిస్తూ ఉండాలా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు రాజ్ నాథ్. విపక్ష నాయకులేమైనా జోకులేస్తున్నారా అని మండిపడ్డారు. దాడి జరిగిన సమయంలో అక్కడ 300 సెల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నాయని ఎన్టీఆర్వో స్పష్టం చేసిందని, మరి ఆ ఫోన్లను చెట్లు వాడినట్లా? అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్వో వంటి ప్రతిష్టాత్మక సంస్థను కూడా ప్రతిపక్షాలు నమ్మడం లేదన్నారు.

ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో లెక్క కావాలంటే కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ వెళ్లి శవాలను లెక్కించుకోవాలని రాజ్ నాథ్ అన్నారు. ఎయిర్ ఫోర్స్ జవాన్లు అక్కడ ఎంత మందిని చంపారో ఆ ప్రాంతంలో ఉండేవారిని అడిగి తెలుసుకోండి అని చెప్పారు.

పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ లోని బాలాకోట్ ఉగ్ర క్యాంపులపై భారత వాయుసేన దాడి చేసింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26న తెల్లవారు జామున 3.30 సమయంలో సరిహద్దు దాటి వెళ్లి దాదాపు 1000 కిలోల బాంబులను జైషే టెర్రర్ క్యాంపులపై వేశాయి. ఈ దాడిలో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే అక్కడ కొన్ని చెట్లు ధ్వంసం అవడం తప్ప మరేం నష్టం జరగలేదని పాక్, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎయిర్ స్ట్రైక్ ప్రతిఫలమేంటని, అక్కడ ఎంత మంది మరణించారో చెప్పాలని కోరుతున్నాయి.