ఆప్ఘన్‌లో 300మంది తాలిబాన్ల విడుదల

ఆప్ఘన్‌లో 300మంది తాలిబాన్ల విడుదల

కాబూల్ : ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం తాలిబాన్లకు స్నేహహస్తం చూపుతోంది. దశాబ్దాలుగా తాలిబాన్ల తిరుగుబాటుతో.. ఆ దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో.. శాంతి స్థాపనకు సహకరించాలంటూ తాలిబాన్లను కోరుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.

ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలకు రావాలని ఆహ్వానించిన అద్యక్షుడు ఘనీ.. వారి సమస్యలను పరిష్కరిస్తామని మే 3న హామీ ఇచ్చారు అధ్యక్షుడు ఘనీ. అందుకు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. రంజాన్ నెలలో… 170 మంది తాలిబాన్లను జైళ్లనుంచి విడుదల చేశారు. ఇవాళ మరో 130మందిని విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరో వెయ్యి మంది వరకు బందీలను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పాలనలో సహకరించాలని కోరారు.

తాలిబాన్లకు, ఆప్ఘన్ ప్రభుత్వానికి మధ్య రెండు దశాబ్దాలుగా తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ప్రాణ, ఆస్తి నష్టం అపారంగా జరిగింది. యుద్ధం, ఎదురుకాల్పులు, తనిఖీల సందర్భంగా దొరికిన తాలిబాన్లను, వారి సానుభూతి పరులను జైళ్లలో పెట్టింది అక్కడి ప్రభుత్వం. వేలమంది ఇప్పటికే జైళ్లలో ఉన్నారు.

ఐతే.. ప్రభుత్వం తీసుకుంటున్న విడుదల చర్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విస్తృత స్థాయిలో చర్చలు జరపకుండానే, ఆలోచన చేయకుండానే తాలిబాన్ల విడుదల జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.