V6 News

10 వేల పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్..తొలి విడతలో 3 వేల కేంద్రాల్లో ఏర్పాటు

10 వేల పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్..తొలి విడతలో 3 వేల కేంద్రాల్లో ఏర్పాటు
  • తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 3 వేల కేంద్రాల్లో ఏర్పాటు
  • మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్​లు, పేపర్లు 
  • నేడు గ్రామాలకు తరలింపు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా, తొలి విడత  ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం  పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్​ బాక్స్​లు, పేపర్లు చేరుకోగా..  బుధవారం వీటిని గ్రామాల్లోని  పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. సమస్యాత్మక పోలింగ్​కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్​కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించనున్నారు. ఈసారి మూడు విడతల్లో కలిపి 10,279 పోలింగ్​కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్​ నిర్వహించనున్నారు. తొలి విడతలో దాదాపు 3 వేలకు పైగా కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్​ చేపడతారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని.. పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్​సృజన, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎన్నికల ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్​సామగ్రి తరలింపు తదితర అంశాలపై ఆరా తీశారు. అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. పోలింగ్​పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటించాలని.. ఆ తర్వాత ఉప సర్పంచ్​ఎన్నిక ప్రక్రియ చేపట్టాలన్నారు. కాగా, ఈసారి ‘గ్రీన్​ పోలింగ్’​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఓటర్లను చైతన్యం చేసేలా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. 

ఎన్నికలకు రూ.175 కోట్లు.. 

నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణ బాధ్యతలను స్టేజ్–1 రిటర్నింగ్​ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు. ఇప్పుడీ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు స్టేజ్​–2 రిటర్నింగ్​ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్లింది. వీళ్లు ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేయడంతో పాటు వాళ్లకు అవసరమైన సౌలతులు కల్పిస్తారు. పోలింగ్​కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పేపర్లు తరలించడం, సిబ్బందికి భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, డీపీవోలు, జడ్పీసీఈవోలు, మండలాల్లో ఆర్డీవోలు,  ఎంపీడీవోలు ఎన్నికల సామగ్రి పంపిణీ చేపడతారు. 10 పోలింగ్​కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్​ఆఫీసర్​(పీవో), అసిస్టెంట్​ప్రిసైడింగ్​ఆఫీసర్​ (ఏపీవో)తో పాటు పోలింగ్ సిబ్బంది ఉంటారు. కాగా, పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటికే రూ.100 కోట్లపైగా మంజూరయ్యాయి. ఈ నిధులు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ఆఫీసర్ల ఖాతాలో వేశారు. పోలింగ్​ కేంద్రాల వారీగా ఎంపీడీవోల ఖాతాలో నిధులు జమయ్యాయి. మరో రూ. 75 కోట్లు కూడా ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ నిధులు సరిపోవని, మరో రూ.40 నుంచి 50 కోట్ల వరకు అవసరమవుతాయని పంచాయతీరాజ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు 
తెలిసింది. 

కొన్ని చోట్ల మళ్లీ బ్యాలెట్ పేపర్ల ముద్రణ..

తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,836  సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనుండగా.. 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 37,440 వార్డులకు 149 చోట్ల నామినేషన్లు రాలేదు. రికార్డు స్థాయిలో 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు 67,893 మంది పోటీలో ఉన్నారు. ఒక్కొక్క సర్పంచ్​స్థానానికి సగటున ఆరుగురు బరిలో నిలిచారు. సర్పంచ్​అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్​అభ్యర్థి బ్యాలెట్ పేపర్ గులాబీ, వార్డు సభ్యుడిది​తెలుపు రంగులో ఉంటుంది. అయితే, బ్యాలెట్ పేపర్లను 8 నెలల కిందనే ముద్రించి జిల్లాలకు పంపించారు.

 ఈసారి గతంతో పోలిస్తే తక్కువ నామినేషన్లు వచ్చాయి. అనుకున్న స్థాయిలో నామినేషన్లు రాకపోవడంతో మళ్లీ బ్యాలెట్​పేపర్లు ముద్రించాల్సి వస్తోంది. 10 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ప్రస్తుతమున్న బ్యాలెట్ పేపర్​పని చేస్తుంది. కానీ ముగ్గురు, నలుగురు మాత్రమే పోటీలో ఉన్న చోట్ల చిన్న బ్యాలెట్ పేపర్ అవసరమవుతుంది. గతంలో బ్యాలెట్​ను విభజిస్తే సరిపోయేది. ఇప్పుడు నోటా గుర్తు ఉండటంతో తప్పనిసరిగా చిన్న బ్యాలెట్​ముద్రించాల్సి వస్తుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు ఉపసంహరణ తర్వాత బ్యాలెట్​ముద్రిస్తారు. సర్పంచ్​ఎన్నికలకు ముందే బ్యాలెట్ పేపర్ ముద్రించడంతో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ధనం కూడా వృథా అవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ మాదిరిగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బ్యాలెట్​పేపర్ ముద్రించాలని కోరుతున్నారు.