3 వేల కేజీల టమాటాలు.. 3 గంటల్లో ఎగబడి కొన్నారు

3 వేల కేజీల టమాటాలు.. 3 గంటల్లో ఎగబడి కొన్నారు

దేశవ్యాప్తంగా టమాట ధరలు మండిపోతున్నాయి. ఆయా రాష్ట్రాలను బట్టి కేజీ టమోటా రూ.100 నుంచి రూ.150 దాకా పలుకుతోంది. ఇలా ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలా అయితే ఎలా బ్రతకాలంటూ అందరూ నిట్టూరుస్తున్నారు. ఇలాంటి సమయాన కాన్పూర్ లో కిలో టమాటా రూ. 80కే విక్రయించడంతో జనాలు పోటెత్తారు.

ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ లోని నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్) మొబైల్ వ్యాన్‌ల ద్వారా కిలో టమాటా రూ. 80కే విక్రయించింది. దీంతో ప్రజలు కొన్ని గంటల్లోనే ఎగబడి మరీ వాటిని కొనేశారు. 3 గంటల్లో ఏకంగా 3000 కిలోలు అమ్ముడవ్వడం గమనార్హం.

టమాటాలు కొనలేక అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం ఎన్‌సిసిఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా ఒక్కొక్కరికి 2 కిలోలు విక్రయించినట్లు ఎన్‌సిసిఎఫ్ బ్రాంచ్ సౌమ్య బిష్త్ వెల్లడించారు. నగరవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ విక్రయాలు సాగించినట్లు ఆమె తెలిపారు. ఈ టమోటా కర్ణాటక నుండి కొనుగోలు చేసినట్లు ఆమె వెల్లడించారు.