తెలంగాణలో ఓటర్లు 3.17 కోట్లు.. తుది జాబితా రిలీజ్​ చేసిన ఈసీ

తెలంగాణలో  ఓటర్లు  3.17 కోట్లు.. తుది జాబితా రిలీజ్​ చేసిన ఈసీ
  • ఓటు హక్కు నమోదుకు ఇంకా చాన్స్​
  • 1,58,71,493 మంది పురుషులు... 1,58,43,339 మంది మహిళలు
  • ఓటు హక్కు లేనివాళ్లు నమోదు చేసుకునేందుకు ఇంకా చాన్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ​వెల్లడించింది. ఇందులో పురుషులు1,58,71,493 కాగా.. మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. ట్రాన్స్​జెండర్​ఓటర్లు 2,557 మంది ఉన్నారు. వీటికి సర్వీస్​ ఓటర్లను కలిపితే ఈ సంఖ్య 3,17,32,727కు చేరుతుంది. ఈ ఏడాది జనవరిలో రిలీజ్​ చేసిన జాబితాతో పోలిస్తే 5.8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఈసీ తెలిపింది. కొత్తగా 17.01 లక్షల మంది ఓటు హక్కును పొందారు. రాష్ట్రవ్యాప్తంగా 6.10 లక్షల మంది ఓట్లను తొలగించారు. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి 998:1000గా ఉంది. 18 నుంచి19 సంవత్సరాల మధ్య వయసు గల ఓటర్లు 8,11,640 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో మొత్తం 22 లక్షల 2 వేల168 మంది ఓటర్లను తొలగించారు. ఇందులో బోగస్​, డూబ్లికేట్15,91,474  మంది ఓటర్లను డిలీట్​చేయగా.. చనిపోయిన ఓటర్లు 6,10,694 మంది ఉన్నారు. ఓటర్ల నమోదుకు ఇంకా అవకాశం ఉందని.. ఎవరైనా అప్లై చేసుకోని వారు ఉంటే చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్​ వచ్చి.. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీకి10 రోజుల ముందు వరకు కూడా ఓటు హక్కుకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఆ జాబితాను సప్లిమెంటరీగా రిలీజ్​ చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒకే కుటుంబంలో 6 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న 7.66 లక్షల కుటుంబాలను వెరిఫై చేసినట్లు చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఫైనల్​ లిస్ట్​ను రిలీజ్​ చేసినట్లు ఈసీ పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా శేర్​లింగంపల్లి నియోజకవర్గంలో, తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల జాబితాకు సంబంధించి కొత్త సాఫ్ట్​వేర్​ ఈఆర్పీ నెట్​2.0ను తీసుకువచ్చారు. దీని పనితీరు, ఇబ్బందులపై కేంద్ర ఎన్నికల కమిషన్​ సమీక్షించింది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఈసీ బృందం పేర్కొంది.

నేడు ఈసీతో రాష్ట్ర పోలీస్‌‌ శాఖ భేటీ

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)తో గురువారం రాష్ట్ర పోలీస్‌‌ శాఖ భేటీ కానుంది. ఇందులో హోం శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ జితేందర్‌‌‌‌, డీజీపీ అంజనీకుమార్‌‌‌‌, లా అండ్​ ఆర్డర్ డీజీ సంజయ్‌‌ జైన్‌‌తో పాటు మూడు కమిషనరేట్ల సీపీలు పాల్గొననున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో డబ్బు పంపిణీపై పటిష్ట నిఘా పెట్టనున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాలు, రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాల గురించి చర్చించనున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల వారీగా బందోబస్తుకు అవసరమైన కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల వివరాలను ఇప్పటికే ఈసీకి అందించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక బందోబస్తుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించనున్నట్లు తెలిసింది.

కేటగిరి        ఓటర్ల సంఖ్య
పురుషులు     -     1,58,71,493
మహిళలు      -     1,58,43,339
ట్రాన్స్‌‌‌‌జెండర్లు    - 2,557
మొత్తం ఓటర్లు     - 3,17,17,389  
సర్వీస్​ ఓటర్లు     15,338