తల్లిదండ్రుల కోసం..ప్లకార్డు పట్టుకున్న పిల్లోడి ఫొటో వైరల్​

తల్లిదండ్రుల కోసం..ప్లకార్డు పట్టుకున్న పిల్లోడి ఫొటో వైరల్​
  • 317 జీఓతో వేర్వేరు చోట్ల తల్లిదండ్రుల ఉద్యోగాలు 
  • తన బాధను చెప్పుకుంటూ వాయిస్ ​రికార్డు పోస్ట్​ చేసిన తల్లి  

మల్యాల, వెలుగు : 317 జీఓతో మహిళా కానిస్టేబుల్​ఒక జిల్లాలో..భర్త మరో జిల్లాలో డ్యూటీ చేస్తున్నారు. మూడేండ్ల కొడుకును తన వెంట తీసుకువెళ్లినా నాన్నా..నాన్న అంటూ కలవరిస్తున్నాడు.  భర్త ఎడబాటు, నాన్న కోసం ఏడుస్తున్న కొడుకు ఆవేదనను తట్టుకోలేక ఆ తల్లి చలించిపోయింది. ఏడుస్తూ  సీఎంకు, డీజీపీకి తన బాధను చెప్పుకుంటూ వాయిర్​ రికార్డు చేసింది. ‘సీఎం సారూ అమ్మానాన్నలను కలపండి’ అంటూ కొడుకు పట్టుకున్న ప్లకార్డుతో కలిపి వాయిస్ ​రికార్డును సోషల్​మీడియాలో పోస్ట్​ చేసింది. ఇప్పుడిది వైరల్​గా మారింది.

జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్​స్టేషన్​లో పని చేస్తున్న మంజుల అనే ​కానిస్టేబుల్​ ఇంతకుముందు సిరిసిల్ల జిల్లాలో పని చేశారు. ఈమె భర్త అదే జిల్లాలోని 17 బెటాలియన్ లో డ్యూటీ చేసేవారు. 317 జీఓలో భాగంగా మంజులను మల్యాల పీఎస్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. దీంతో ఆమె తన మూడేండ్ల కొడుకుతో  మల్యాలకు వచ్చి డ్యూటీ చేస్తోంది. బందోబస్తుకు కూడా అతడిని చంకనెత్తుకుని వెళ్లాల్సి వస్తోంది. కొద్ది రోజులుగా కొడుకు నాన్న కోసం కలవరిస్తున్నాడు. కలత చెందిన మంజుల తనకు, తన భర్తకు ఒకేచోట పోస్టింగ్​ఇవ్వాలని ఏడుస్తూ పోస్ట్​ పెట్టింది. లేకపోతే చచ్చిపోవడం ఒక్కటే మార్గమని   చెప్పింది. జిల్లాలు మారడంతో తామంతా వేరుగా ఉండాల్సి వస్తోందని వాపోయింది. ఈ పోస్ట్​ చూసిన వారంతా 317 జీఓను రద్దు చేసి, భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్​ఇవ్వాలని కామెంట్స్​ పెడుతున్నారు.