డిసెంబర్ 6న సీరియల్ బ్లాస్ట్లకు ప్లాన్.. 32 కార్లతో ఆత్మాహుతి దాడులకు స్కెచ్

డిసెంబర్ 6న సీరియల్ బ్లాస్ట్లకు ప్లాన్..  32 కార్లతో ఆత్మాహుతి దాడులకు స్కెచ్
  •  
  • ఢిల్లీలోని 6 ఏరియాల్లో పేలుళ్లే లక్ష్యం.. అల్‌‌ ఫలా యూనివర్సిటీ అడ్డాగా కుట్ర
  • బిల్డింగ్ నంబర్ 17.. రూమ్ నంబర్ 13లో ప్లానింగ్
  • ముజమ్మిల్ గది నుంచి డైరీలు స్వాధీనం.. ఎన్‌‌క్రిప్టెడ్ మెసేజ్‌‌లు, డిజిటల్‌‌ డివైజెస్ గుర్తింపు
  • దాడులకు రూ.20 లక్షలు పోగేసుకున్న టెర్రరిస్టులు
  • 3 లక్షలతో 20 క్వింటాళ్ల ఎన్​పీకే ఫర్టిలైజర్​ కొనుగోలు
  • దర్యాప్తు ఏజెన్సీల ఎంక్వైరీలో సంచలన విషయాలు

న్యూఢిల్లీ:  బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు డిసెంబర్‌‌‌‌ 6న ఢిల్లీలో వరుస బాంబుపేలుళ్లు జరపాలని డాక్టర్ల ముసుగులోని టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు తేలింది. 6 దశల్లో దాడులు జరిపేందుకు గాను మొత్తం 32 కార్లను కొనేందుకు వారు సిద్ధమయినట్లు ఎన్‌‌‌‌ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మారుతి సుజుకి బ్రెజా, మారుతి స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ ఐ20 సహా మొత్తం 32 కార్లను బ్లాస్ట్​లు, పేలుడు పదార్థాలు ట్రాన్స్​పోర్ట్ చేసేందుకు టెర్రరిస్టులు నిర్ణయించారు. ఢిల్లీలో 6 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. లక్నో, ఆగ్రాలోనూ దాడులకు ప్లాన్ చేశారు. పోలీసులు ట్రేస్ చేయడానికి వీల్లేకుండా.. పాత కార్లు, ఎక్కువసార్లు ఓనర్లు మారిన కార్లను పేలుళ్లకు ఉపయోగించాలని భావించారు. హెచ్ఆర్ 87 యూ 9988 నంబర్ బ్రెజా కారును అల్ ఫలా యూనివర్సిటీ క్యాంపస్​లో స్వాధీనం చేసుకున్నారు. డీఎల్ 10 సీకే 0458 నంబర్ ఎకో స్పోర్ట్స్ కారును హర్యానాలోని ఫరీదాబాద్​లో గుర్తించారు. పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న డిజైర్ కారును సోమవారం పట్టుకున్నారు. కాగా, ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 250 మందిని ప్రశ్నించారు. డాక్టర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు సహా 12 మందిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. 

వర్సిటీ హాస్టల్ బిల్డింగ్​లో సోదాలు

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా హర్యానా ఫరీదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలా యూనివర్సిటీని ఏజెన్సీ బృందాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. వర్సిటీ బిల్డింగ్​లోని అన్ని గదులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. బాయ్స్ హాస్టల్​లోని బిల్డింగ్ నంబర్ 17లో ఉన్న రూమ్ నంబర్ 13, రూమ్ నంబర్ 4.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రూమ్ నంబర్ 13లో ముజమ్మిల్, రూమ్ నంబర్ 4లో ఉమర్ నబీ ఉండేవాళ్లు. దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఈ గదుల్లోనే కూర్చొనే స్కెచ్ వేసినట్లు దర్యాప్తు ఏజెన్సీలు నిర్ధారణకు వచ్చాయి. డాక్టర్ ముజమ్మిల్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉండగా.. ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ముజమ్మిల్ రూమ్​లోనే ఎక్కువగా సార్లు సమావేశం అయ్యేవాళ్లు. నబీ రూమ్ నుంచి 3, ముజమ్మిల్ గది నుంచి ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో పేలుళ్లకు సంబంధించి రాసిపెట్టుకున్న ప్లానింగ్ చూసి అధికారులే షాక్​కు గురవుతున్నారు. వీరు దేశవ్యాప్తంగా 4 ప్రధాన నగరాల్లో దాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఇందుకోసం 8 మంది సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాంబర్లను సిద్ధం చేసినట్లు సమాచారం.

డైరీల్లో కోడెడ్ ఎంట్రీలు

టెర్రరిస్ట్ యాక్టివిటీస్​కు రూమ్ నంబర్ 13 కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. యూనివర్సిటీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కొన్ని కెమికల్స్ తీసుకురావాలని ఉమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నబీ, ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలిసింది. ఈ ల్యాబ్ ముజమ్మిల్ రూమ్ పక్కనే ఉంటుంది. 13వ నంబర్ గదిలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రిప్టెడ్ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివైజెస్, పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి డైరీల్లో కోడెడ్ ఎంట్రీలు, తేదీలు, పేర్లతో కూడిన కొన్ని వివరాలు లభించాయి. ప్రతి రోజూ ఉదయం, రాత్రి సమావేశం అయ్యేవాళ్లు. వేరేవాళ్లు రూమ్​లోకి రాకుండా లాక్ చేసుకునేవాళ్లు. డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తున్నది. వారంతా జమ్మూకశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫరీదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. దీంతోపాటు నవంబరు 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే వీరు దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఉమర్ నబీ వద్దే మొత్తం ఫండ్స్

ముజమ్మిల్, ఆదిల్ రాథర్, షాహీద్ సయీద్, ఉమర్ నబీ కలిసి దాడులకు నిధులు సేకరించారు. ఢిల్లీలో దాడుల కోసం మొత్తం రూ.20 లక్షలు జమ చేసుకున్నారు. డిసెంబర్ 6 (అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత రోజు), ఛబ్బీస్ జనవరి రోజు పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఈ డబ్బు మొత్తం ఉమర్ వద్దే ఉంచారు. గుర్గావ్, నూహ్​తో పాటు చుట్టుపక్క పట్టణాల నుంచి 26 క్వింటాళ్ల ఎన్​పీకే ఫర్టిలైజర్ కొన్నారు. దీని కోసం రూ.3 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ ఫర్టిలైజర్​ను ఐఈడీ బాంబుల తయారీలో ఉపయోగిస్తారు. బ్లాస్ట్​ల కోసం ఐ20, ఎకోస్పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరో 2 పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వారు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు సమాచారం. ఇందులో ఐ20 కారులోనే ఎర్రకోట వద్ద పేలుడు జరగ్గా.. ఎకోస్పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక్కో ఏరియాకు ఇద్దరు సూసైడ్ బాంబర్లు

ఢిల్లీలో బ్లాస్ట్​లకు 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు డైరీల సమాచారంతో అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి ఇద్దరు చొప్పున వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ 8 మందిలో ఉమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నట్లు తెలిపాయి. ఈ ఉగ్ర కుట్రను అమలుచేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించినట్లు సమాచారం.

అల్ ఫలా వర్సిటీ ఫౌండర్​కు క్రిమినల్ హిస్టరీ

ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్ కేసు మొత్తం అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలా యూనివర్సిటీ చుట్టే తిరుగుతున్నది. ఈ వర్సిటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధిఖీపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్​లోని దేవీ అహిల్యా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సిద్ధిఖీ.. అల్ ఫలా చారిటబుల్ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తూ యూనివర్సిటీని రన్ చేస్తున్నాడు. విద్య, ఫైనాన్స్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్, ఎనర్జీ, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కన్సల్టెన్సీ వంటి మొత్తం 9 రంగాల్లో బిజినెస్ చేస్తున్నాడు. 2000లో ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిద్ధిఖీకిపై ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్ కేసు నమోదైంది. 2001లో అరెస్ట్ అయిన సిద్ధిఖీ.. తిహార్ జైలులో మూడేండ్లు ఉన్నాడు. 2003లో ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్​ను తిరస్కరించింది. మోసపోయిన ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి ఇవ్వడానికి అంగీకరించడంతో 2004లో బెయిల్ దొరికింది. మొత్తం రూ.7.5 కోట్ల మేర చీటింగ్ చేశాడు.