పారాక్వాట్‎ను నిషేధించిన 32 దేశాలు.. మనదేశంలోనూ బ్యాన్ కోసం డాక్టర్ల పోరు బాట

పారాక్వాట్‎ను నిషేధించిన 32 దేశాలు.. మనదేశంలోనూ బ్యాన్ కోసం డాక్టర్ల పోరు బాట

హైదరాబాద్: రాష్ట్రంలో గడ్డి మందు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నది. పంటచేలలో గడ్డి గాదాన్ని నాశనం చేసే పారాక్వాట్ డైక్లోరైడ్ మందు.. మనిషి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలను దెబ్బ తీస్తూ రోజుల వ్యవధిలోనే ప్రాణాలను  బలిగొంటున్నది. ఈ గడ్డి మందు మార్కెట్​లో తక్కువ ధరకే దొరుకుతుండటం, కొద్దిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేస్తుండటంతో రైతులు దీన్ని వాడేందుకే మొగ్గుచూపుతున్నారు. దాదాపుగా ప్రతి రైతు ఇంట్లోనో, పొలం వద్దనో పారాక్వాట్ గడ్డి మందు అందుబాటులో ఉంటోంది. 

దీంతో ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా, ఆర్థిక ఇబ్బందులు, తగాదాల వంటి సమస్యలు, పరీక్షల్లో, ప్రేమలో ఫెయిల్ అవడం లాంటి చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో రైతులు, రైతుల పిల్లలు ఈ మందు తాగుతున్నారు. దీనికి విరుగుడు లేకపోవడంతో కొన్ని రోజుల పాటు ప్రాణాలతో పోరాడి, కిడ్నీలు, కాలేయం దెబ్బతిని, ఊపిరితిత్తులు చెడిపోయి చివరికి చనిపోతున్నారు. మరోవైపు దీని అమ్మకాలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఫర్టిలైజర్ షాపులతో పాటు ఆన్​లైన్​లోనూ విచ్చలవిడిగా అమ్ముతున్నారు.  

32 దేశాల్లో నిషేధం.. 

ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలు పారాక్వాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి. మన దేశంలో కేరళ, ఒడిశా ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేశాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం దీని అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఫర్టిలైజర్ షాపుల్లోనే కాకుండా, ఎలాంటి లైసెన్సులు లేని దుకాణాల్లోనూ ఇది దొరుకుతోంది. ఆన్‌‌ లైన్ ఈ-కామర్స్ సైట్లలోనూ క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేంత తేలిగ్గా మారింది. 

ప్రాణాలు తీస్తున్న ఈ కిల్లర్‌‌ మందును రాష్ట్రంలో ఎందుకు నిషేధించడం లేదని సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పారాక్వాట్ అమ్మకాలను నిషేధించాలని, రైతులకు ప్రత్యామ్నాయ మందులపై సబ్సిడీలు ఇచ్చి, వారిలో చైతన్యం తీసుకురావాలని కోరుతున్నారు. లేకపోతే పల్లెల్లో పారాక్వాట్ సృష్టిస్తున్న ఈ మృత్యుఘోషకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

పారాక్వాట్ బ్యాన్ కోసం డాక్టర్ల పోరుబాట

తమ కండ్ల ముందే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూడలేక, బాధితులను కాపాడడానికి మరో మార్గం లేక.. పారాక్వాట్ ను బ్యాన్​ చేయాలని డాక్టర్లు పోరుబాట పట్టారు. ఖమ్మం, మంచిర్యాల జిల్లాలకు చెందిన పలువురు డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో 'డాక్టర్స్ అగైనెస్ట్ పారాక్వాట్ పాయిజనింగ్(డీఏపీపీ)'ను ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ర్టవ్యాప్తంగా140 మంది డాక్టర్లు మెంబర్లుగా ఉన్నారు. వీరు 'బ్యాన్ పారాక్వాట్, సేవ్​ సొసైటీ, సేవ్ ఫార్మర్స్, సేవ్ హ్యూమన్' నినాదంతో పారాక్వాట్​బ్యాన్​కోసం పోరాడుతున్నారు. 

ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఉప రాష్ర్టపతి ఎం.వెంకయ్య నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను, కలెక్టర్లను కలిసి పారాక్వాట్​వల్ల జరుగుతున్న ప్రాణనష్టం గురించి వివరించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. సెంట్రల్​అగ్రికల్చర్, ఫర్టిలైజర్స్ మినిస్టర్లను కలవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. కాగా, డీఏపీపీ స్టేట్ ప్రెసిడెంట్​గా డాక్టర్ సతీష్​నారాయణ చౌదరి(ఎమర్జెన్సీ మెడిసిన్, ఖమ్మం), వైస్​ప్రెసిడెంట్​గా డాక్టర్ రాకేశ్​కుమార్ చెన్న(నెఫ్రాలజీ, మంచిర్యాల) ఉన్నారు.