బడుల్లో స్వచ్ఛత అంతంతే!.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఫైవ్ స్టార్ రేటింగ్ స్కూళ్లు 32 మాత్రమే

బడుల్లో స్వచ్ఛత అంతంతే!..  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఫైవ్ స్టార్ రేటింగ్ స్కూళ్లు 32 మాత్రమే
  • థర్డ్​ స్టార్​ రేటింగ్ లోనే అత్యధిక స్కూల్స్​ 
  • బెస్ట్​ ఫైవ్​ స్టార్​ ఎనిమిది స్కూళ్లపై కసరత్తు 
  • స్వచ్ఛ ఏవమ్​, హరిత్​ విద్యాలయ రేటింగ్ కు శ్రీకారం.. 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని బడుల్లో స్వచ్ఛత అంతంత మాత్రంగానే ఉంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా స్వచ్ఛ ఏవమ్​, హరిత​ విద్యాలయ రేటింగ్​ ప్రోగ్రామ్​ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ (మానవ వనరులు) చేపడుతోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛత, హరిత రేటింగ్స్​కు శ్రీకారం చుట్టింది. 

ఫైవ్​ స్టార్​ రేటింగ్​లో 32 స్కూళ్లు..

ఆగస్టు 1 నుంచి అక్టోబర్​15 వరకు స్వచ్ఛ ఏవమ్, హరిత ​విద్యాలయ రేటింగ్ లో పాల్గొనేందుకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో జిల్లాలో 1,673 స్కూల్స్​ రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాయి. పారిశుధ్య నిర్వహణ, టాయిలెట్స్​ వినియోగం, తాగునీరు, పచ్చదనంతో పాటు పలు అంశాలను పక్కాగా అమలు చేస్తున్న స్కూళ్లకు రేటింగ్​ను ఇచ్చింది. ఈ రేటింగ్​ ప్రభుత్వ, ఎయిడెట్, ప్రయివేట్, గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లు​ పాల్గొన్నాయి.

 స్వచ్ఛ ఏవమ్, హరిత విద్యాలయ రేటింగ్ కు దరఖాస్తు చేసుకున్న స్కూళ్లను గత రెండు వారాలుగా 90 మంది స్కూల్​ కాంప్లెక్స్​ హెచ్​ఎంలు పరిశీలించారు. సెల్ఫ్​గా ఇచ్చుకున్న రేటింగ్స్​ను పరిశీలించి వారు ఫైనల్​ రేటింగ్స్​ ఇచ్చారు. ఆ స్కూళ్లలో ఫైవ్​స్టార్​ రేటింగ్​కు 32 స్కూల్స్​ ఎంపికయ్యాయి. ఫోర్​స్టార్​ రేటింగ్​కు 454 స్కూల్స్, త్రీ స్టార్​ రేటింగ్​కు 933, టూ స్టార్​ రేటింగ్​కు 192, సింగిల్​ స్టార్​ రేటింగ్​కు 62 స్కూళ్లను సెలెక్ట్​ చేశారు. 

ఫైవ్​ ఫోర్​ స్టార్​రేటింగ్స్​ స్కూళ్లలో తనిఖీలు.. 

ఫైవ్​ స్టార్​ రేటింగ్​ ఉన్న 32 స్కూళ్లు, ఫోర్​ స్టార్​ రేటింగ్​ ఉన్న 454 స్కూల్స్​పై ప్రత్యేకంగా నియమించిన ఇవాల్యూయేటర్లు అక్టోబర్​ 31వరకు తనిఖీలు నిర్వహించారు. ఫైనల్​గా ఎనిమిది స్కూల్స్​ను సెలెక్ట్​ చేశారు. ఇందులో రూరల్​ విభాగంలో ఒకటి నుంచి ఎనిమిది తరగతి వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్​ మూడు, తొమ్మిదో తరగతి నుంచి ఆపైన ఉన్న స్కూల్స్​ మూడు, అర్బన్​ విభాగంలో ఇదే పద్ధతిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఎనిమిది స్కూళ్లను సెలెక్ట్​ చేశారు. ఈ స్కూళ్లకు కలెక్టర్​ ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు. 

స్టేట్​ లెవెల్​ పోటీలకు ఒకటి లేదా రెండు స్కూళ్లు.. 

స్టేట్​ లెవెల్​ పోటీలకు ఫైనల్​గా సెలెక్ట్​ చేసిన ఎనిమిది స్కూళ్లలో​ ఒకటి లేదా రెండింటిని జిల్లా అధికారులు ఎంపిక చేయనున్నారు. డీఈఓ, డీఎంహెచ్​వో, ఇరిగేషన్​, డీపీఓ, విద్యాశాఖ, మిషన్​ భగీరథ డిపార్ట్​మెంట్లకు చెందిన ఆఫీసర్ల బృందం ఈ ఎనిమిది స్కూళ్లలో స్టేట్​ లెవెల్​ పోటీలకు వెళ్లే స్కూల్స్​ను ఎంపిక చేయనున్నారు. స్టేట్​ లెవెల్​లో బెస్ట్​ అని తేలితే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనవచ్చు. జాతీయ స్థాయిలో గెలిచే స్కూళ్లకు​ రూ. లక్ష చొప్పున నగదు, అవార్డును కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇవ్వనుంది.