గుండు కొట్టించి రాత్రుళ్లు నరకం చూపించాడు.. ఏడాదిన్నర కూతురిని చంపి చచ్చిపోయింది.. ఇలాంటి శాడిస్ట్ భర్తలు కూడా ఉన్నారు !

గుండు కొట్టించి రాత్రుళ్లు నరకం చూపించాడు.. ఏడాదిన్నర కూతురిని చంపి చచ్చిపోయింది.. ఇలాంటి శాడిస్ట్ భర్తలు కూడా ఉన్నారు !

యూఏఈలోని షార్జాలో హృదయవిదారక ఘటన జరిగింది. ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఏడాదిన్నర వయసున్న కన్నబిడ్డను చంపి ఆ తర్వాత ఆమె తన ప్రాణాలు తీసుకుంది. వరకట్న వేధింపులు, భర్త, అత్తింటి వాళ్లు పెట్టిన చిత్రహింసలు భరించలేక తమ కూతురు ఇలా కన్న కూతురిని చంపి.. తాను ప్రాణాలు తీసుకుని అర్థాంతరంగా తనువు చాలించిందని ఆమె తల్లి కన్నీరుమున్నీరయింది.

ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే కొన్ని దారుణమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఫెయిర్గా ఉండటమే ఆ వివాహిత చేసిన పాపమైంది. తండ్రిలా చూసుకోవాల్సిన మామ తనను లైంగికంగా వేధించాడు. అడ్డుకోవాల్సిన ఆమె భర్త ఈ పైశాచిక కృత్యానికి సాక్షిగా నిలిచాడు. ఈ పరిణామాలతో ఆమె తన జీవితంపై విరక్తి చెందింది. తన ఏడాదిన్నర వయసున్న కూతురిని సక్రమంగా చూసుకోరనే భయం ఆమెను వెంటాడింది. కన్నబిడ్డను చంపి ఆ తర్వాత ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. 

భర్త, అత్తింటి వాళ్లు నల్లగా ఉండటంతో ఆ వివాహితకు బలవంతంగా గుండు కొట్టించి అంద విహీనంగా మార్చి.. తిండీతిప్పలు లేకుండా కడుపు మాడ్చారని సదరు వివాహిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కేరళలోని కొల్లాంకు చెందిన విపంజిక మణి అనే 32 ఏళ్ల యువతికి నిదీష్ అనే యువకుడితో వివాహం అయింది. కేరళకు చెందిన విపంజిక, నిదీష్ యూఏఈలోని షార్జాలో ఒక ఫ్లాట్లో ఉంటున్నారు. నిదీష్ కుటుంబం కూడా వీళ్లతోనే కలిసి ఉంటోంది. జులై 8న విపంజిక, ఏడాదిన్నర వయసున్న ఆమె కూతురు వైభవి తమ ఫ్లాట్లో విగత జీవులుగా పడి ఉన్నారు.

అత్తింటి వేధింపులు, వరకట్న వేధింపులు ఈ ఇద్దరి ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. విపంజిక భర్త నిదీష్ను ఏ1 నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. నిదీష్ తండ్రి, నిదీష్ సోదరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విపంజికను మానసికంగా, శారీరకంగా హింసించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారని విపంజిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు.. నిదీష్తో పాటు అతని కుటుంబ సభ్యులు నల్లగా ఉంటారు.

విపంజిక ఫెయిర్ స్కిన్. ఆమె రంగు కూడా నిదీష్కు, అతని కుటుంబానికి నచ్చలేదు. ఆమెను అంద విహీనంగా చేయడానికి గుండు కొట్టించారు. చిత్రహింసలకు గురిచేశారు. నిదీష్ వివాహేతర సంబంధాల గురించి విపంజిక నిలదీయడంతో ఆమెకు విడాకుల నోటీసులు పంపి ఇంట్లోంచి గెంటేస్తామని బెదిరించారు. తాను అనుభవించిన మానసిక వేదనను, శారీరక యాతనను విపంజిక తన ఫేస్ బుక్ పోస్ట్తో పాటు తన స్వహస్తాలతో రాసిన నోట్లో పూసగుచ్చినట్టు వివరించింది.

పెళ్లైన కొన్నాళ్లకే తన భర్త శాడిస్ట్లా ప్రవర్తించాడని.. నీలి చిత్రాలు చూస్తూ అందులో ఉన్నట్టు చేయాలని రాత్రుళ్లు నరకం చూపించాడని విపంజిక భర్త శాడిజం గురించి తన నోట్లో బయటపెట్టింది. గర్భిణి అనే కనీస కనికరం లేకుండా తనకు ఫుడ్ కూడా పెట్టకుండా నరకం చూపించారని, తన భర్తతో పాటు మామను, తన భర్త సోదరిని కఠినంగా శిక్షించాలని తన నోట్లో విపంజిక డిమాండ్ చేసింది.