20 జడ్పీ పీఠాలు మహిళలకే

20 జడ్పీ పీఠాలు మహిళలకే

హైదరాబాద్‌‌, వెలుగు:రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్​ చైర్​పర్సన్​ పదవుల్లో 20 పదవులు మహిళలకు దక్కాయి. మొత్తం సీట్లలో 16 సీట్లను మహిళలకు రిజర్వ్‌‌ చేయగా అదనంగా జనరల్​లో నాలుగు సీట్లను వారికి టీఆర్​ఎస్​ కేటాయించింది. ఓవరాల్​గా చూస్తే మూడింట రెండు వంతుల జడ్పీ పీఠాలు మహిళలకే లభించాయి. రాష్ట్రంలోని 32 జడ్పీ చైర్​పర్సన్, 32 జడ్పీ వైస్​ పర్సన్​  పదవులకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. మొన్నటి పరిషత్​ ఎన్నికల్లో ఎక్కువ మొత్తం జడ్పీటీసీలను గెలుచుకున్న టీఆర్​ఎస్​కే  అన్ని జడ్పీ పీఠాలు దక్కాయి. ఆ పార్టీ అభ్యర్థులే జడ్పీ చైర్​పర్సన్లు అయ్యారు. పరిషత్​ ఎన్నికలప్పుడే ముగ్గురు నలుగురు నేతలను జడ్పీ చైర్​పర్సన్​ అభ్యర్థులుగా టీఆర్​ఎస్​ ప్రకటించింది. మరికొందరికి అవకాశం ఇస్తామని హామీలు ఇచ్చింది. అయితే.. అలా హామీలు అందుకున్నవారిలో కొందరికి పదవులు దక్కలేదు. వారి స్థానంలో కొత్తవారికి చాన్స్​ లభించింది.

రెడ్లకు 12

జడ్పీ చైర్​పర్సన్​ పదవుల్లో సగం సీట్ల(16)ను జనరల్‌‌కు, సగం సీట్ల(16)ను బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీనవర్గాలకు రిజర్వ్‌‌ చేయగా అదనంగా జనరల్​లో ఒక సీటు బడుగు బలహీనవర్గాలకు టీఆర్​ఎస్​ కేటాయించింది. 17 చోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలు జడ్పీ చైర్​పర్సన్లు అయ్యారు. కమ్యూనిటీ ప్రకారం చూస్తే 12  చోట్ల రెడ్డి వర్గం వారికి  జడ్పీ చైర్​పర్సన్లుగా  టీఆర్​ఎస్​ అవకాశం ఇచ్చింది. జనరల్‌‌కు కేటాయించిన ములుగు జడ్పీ చైర్​పర్సన్​ పదవిని పద్మశాలి (బీసీ) కులానికి చెందిన కుసుమ జగదీశ్‌‌కు కేటాయించింది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్​గా  పనిచేసిన కుసుమ జగదీశ్‌‌కు ములుగు, బండ నరేందర్‌‌రెడ్డికి నల్గొండ, డాక్టర్‌‌ మారపెల్లి సుధీర్‌‌కుమార్‌‌కు వరంగల్‌‌ అర్బన్‌‌, రాథోడ్‌‌ జనార్దన్‌‌కు ఆదిలాబాద్‌‌ జడ్పీ పీఠాలు దక్కాయి. టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జడ్పీ వైస్‌‌ చైర్​పర్సన్​ పదవిని స్టూడెంట్ లీడర్​ సిద్ధం వేణుకు ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యేలు, వారి బంధువులు

మాజీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ (ఆసిఫాబాద్‌‌), పుట్ట మధు (పెద్దపల్లి), కోరం కనకయ్య (భద్రాద్రి కొత్తగూడెం) జడ్పీ చైర్​పర్సన్​ పీఠాలు దక్కించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఒదేలు భార్య భాగ్యలక్ష్మి (మంచిర్యాల), భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య జ్యోతి (వరంగల్‌‌ రూరల్‌‌), మాజీ మంత్రి మహేందర్‌‌రెడ్డి భార్య సునీతారెడ్డి (వికారాబాద్‌‌), మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌‌రెడ్డి భార్య స్వర్ణ (మహబూబ్‌‌నగర్‌‌),మాజీ మంత్రి మాధవరెడ్డి కొడుకు సందీప్‌రెడ్డి (యాదాద్రి), మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి (రంగారెడ్డి), అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేసి ఓడిపోయిన లింగాల కమల్‌రాజ్‌ (ఖమ్మం)కు టీఆర్​ఎస్ జడ్పీ చైర్​పర్సన్​ పదవులిచ్చింది. ఇదిలా ఉంటే.. మహిళలకు అదనంగా దక్కిన నాలుగు జడ్పీ చైర్​పర్సన్​ పదవుల్లో వనజమ్మ (నారాయణపేట), దావ వసంత (జగిత్యాల), స్వర్ణా సుధాకర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌),
పద్మావతి (నాగర్‌కర్నూల్‌) ఉన్నారు. ఓవరాల్​గా 32 జడ్పీ వైస్‌ చైర్​పర్సన్​ పోస్టుల్లో 23 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, తొమ్మిది పదవులు ఓసీలకు కేటాయించారు.

కొందరికి షాక్​.. ఇంకొందరికి చాన్స్​

జనగామ జడ్పీ చైర్​పర్సన్​ పదవి ఎన్నిక సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. ఆ పదవిని గుడి వంశీధర్‌రెడ్డి, ప్రేమలతారెడ్డి ఆశించినా.. స్థానిక ఎమ్మెల్యే ఆశీస్సులతో సంపత్‌రెడ్డి దక్కించుకున్నారు. ఆదిలాబాద్‌ జడ్పీ చైర్​పర్సన్​ పదవిని లోక్​సభ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన అనిల్‌ జాదవ్‌కు ఇస్తారని ప్రచారం జరిగింది. జిల్లాకు చెందిన నాయకుల మధ్య ఆధిపత్య పోరులో అనిల్‌కు బదులు రాథోడ్‌ జనార్దన్‌కు లభించింది. నాగర్‌కర్నూల్‌ చైర్​పర్సన్​ పదవి ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్‌కు ఇస్తారని ప్రచారం జరిగినా స్థానిక నాయకత్వం వ్యతిరేకించడంతో పద్మావతికి ఇచ్చారు. మహబూబాబాద్‌ చైర్‌పర్సన్‌ పదవిని గుగులోత్‌ సుచిత్రకు ఇస్తారని ప్రచారం జరిగినా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ సమీప బంధువు బిందుకు ఆ చాన్స్​ దక్కింది. నారాయణపేటలోనూ ప్రచారంలో ఉన్న పేర్లను పక్కనబెట్టి వనజమ్మకు జడ్పీ చైర్​పర్సన్​గా అవకాశం ఇచ్చారు. కొత్తగూడెం జడ్పీ చైర్​పర్సన్​ పదవిని ఆశించిన పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భార్యకు మణుగూరు ఎంపీపీ పదవిని ఇస్తారని స్థానికంగా ప్రచారం జరిగింది. అయితే.. చివరికి ఆ పదవి కూడా ఆమెకు దక్కలేదు.