32.80 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలి : ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌

32.80 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలి  : ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌

శివమ్‌‌‌‌ కమిటీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగి సీజన్‌‌‌‌లో ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల కింద 32.80 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలని ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయించింది. మంగళవారం జలసౌధలో ఈఎన్సీ (జనరల్‌‌‌‌) మురళీధర్‌‌‌‌ అధ్యక్షతన నిర్వహించిన స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌ కమిటీ ఫర్‌‌‌‌ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ వాటర్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ (శివమ్‌‌‌‌) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 23 మేజర్‌‌‌‌, 35 మీడియం ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల కింద 32.80 లక్షల ఎకరాలకు 342 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టులో భాగంగా ఎల్‌‌‌‌ఎండీ దాకా 4.62 లక్షల ఎకరాలకు, ఎల్‌‌‌‌ఎండీ దిగువన 4.95 లక్షల ఎకరాలు, ఎస్సారెస్పీ స్టేజ్‌‌‌‌-2 కింద 3.64 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు. 

నాగార్జునసాగర్‌‌‌‌ ఎడమ కాలువ కింద 6.30 లక్షల ఎకరాలు, కల్వకుర్తి లిఫ్ట్‌‌‌‌ స్కీం కింద 2.78 లక్షల ఎకరాలు, నిజాంసాగర్‌‌‌‌ కింద 80వేలు, అలీసాగర్‌‌‌‌ కింద 79వేలు, జూరాల ప్రాజెక్టు కింద 32వేలు, నెట్టెంపాడు కింద 30వేలు, ఆర్డీఎస్‌‌‌‌ కింద 20వేల ఎకరాలు, దేవాదుల ఎత్తిపోతల కింద 2లక్షల ఎకరాలు, ఏఎమ్మార్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎల్బీసీ కింద 2.65లక్షల ఎకరాలు, ఇతర ప్రాజెక్టుల కింద 65వేల ఎకరాలు, 35 మీడియం ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల కింద 3లక్షల ఎకరాలకు నీళ్లు విడుదల చేయనున్నారు. ఏ ప్రాజెక్టు కింద వరి, ఆరుతడి పంటలకు ఎంత మేరకు నీటిని ఇస్తారు.. ఏయే ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని విడుదల చేస్తారనేది త్వరలోనే విడుదల చేసే మీటింగ్‌‌‌‌ మినిట్స్‌‌‌‌లో స్పష్టత ఇవ్వనున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌‌‌‌లలోని అన్ని ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉండటంతో యాసంగిలో ఆయకట్టుకు నీటి విడుదలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఇంజనీర్లు చెప్తున్నారు.