కరోనాతో అలీఘర్ ముస్లిం వర్శిటీలో 34 మంది ఉద్యోగుల మృతి

కరోనాతో అలీఘర్ ముస్లిం వర్శిటీలో 34 మంది ఉద్యోగుల మృతి

ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి అలీఘర్‌ ముస్లిం వర్శిటీకి చెందిన ఉద్యోగులు 34 మంది కరోనా బారిన పడి ఇటీవల చనిపోయారు. ఈ విషయాన్ని యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ తారీఖ్‌ మన్సూర్‌ ఆదివారం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు. వీరంతా కేవలం 18 రోజుల సమయంలో  ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇతర ఉద్యోగులు కాకుండా...కేవలం 16 మంది అధ్యాపకులు, 18 మంది రిటైర్డ్‌ అద్యాపకులు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ప్రత్యేమైన వేరియంట్‌ ఏదో AMU క్యాంపస్‌, పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇదే వారు చనిపోవడానికి  కారణమై ఉంటుందని అన్నారు. కరోనా వైరస్‌ కట్టడి చేసేందుకు ఇక్కడ అధ్యయనం ఎంతో అవసరమని అన్నారు. జీనోమ్‌ స్వీకెన్సింగ్స్‌ నిమిత్తం జవహర్‌లాల్‌ నెహ్రు మెడికల్‌ కాలేజ్‌లోని మైక్రో బయాలజీ ప్రయోగశాల నుండి న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమ్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ బయోలజీ ల్యాబరేటరీకి శ్యాంపిల్స్‌కు పంపామని తెలిపారు. 15 రోజుల్లో ఇక్కడి ఆస్పత్రుల్లో 25 మంది డాక్టర్లు కూడా కరోనా బారిన పడ్డారని జవహర్‌లాల్‌ నెహ్రు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ సాహిద్‌ అలీ సిద్ధిఖీ తెలిపారు.