కృష్ణా నీళ్లల్లో ఏపీ, తెలంగాణకు చెరి సగం వాటా ఇవ్వాలి

కృష్ణా నీళ్లల్లో ఏపీ, తెలంగాణకు చెరి సగం వాటా ఇవ్వాలి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌లో ఏ స్థాయిలో నీళ్లున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏపీ 34 టీఎంసీలకు మించి మళ్లించుకోవడానికి వీల్లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. కేఆర్‌‌‌‌ఎంబీ రిజర్వాయర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ కమిటీ (ఆర్‌‌‌‌ఎంసీ) మీటింగ్‌‌‌‌లో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను చేర్చలేదని తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేవనెత్తే అంశాలను ఆర్‌‌‌‌ఎంసీ మీటింగ్‌‌‌‌ పాయింట్స్‌‌‌‌లో చేర్చాలని విజ్ఞప్తి చేసింది. ఇరిగేషన్‌‌‌‌ ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ మంగళవారం కేఆర్‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌ ఎంపీ సింగ్‌‌‌‌కు ఈ మేరకు లేఖ రాశారు. ఏపీకి నీటిని తరలించడానికి శ్రీశైలం రిజర్వాయర్‌‌‌‌ నిర్మించలేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌, శ్రీశైలం రైట్‌‌‌‌ మెయిన్‌‌‌‌ కెనాల్‌‌‌‌కు ఉన్న అన్ని అనుమతులు, 1976, 1977 అగ్రిమెంట్లు సహా అన్ని వివరాలు ఇవ్వాలని తాము ఇంతకుముందే పలుమార్లు కృష్ణా బోర్డును కోరామని ఆయన గుర్తు చేశారు. బచావత్‌‌‌‌ ట్రైబ్యునల్‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ 1, జీడబ్ల్యూడీటీ) అవార్డుల ప్రకారం నాగార్జునసాగర్‌‌‌‌ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తరలించే అవకాశమే లేదని, అలాంటప్పుడు కేడీఎస్‌‌‌‌కు 72 టీఎంసీలు సాగర్‌‌‌‌ నుంచి ఇవ్వడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కొత్త ట్రైబ్యునల్‌‌‌‌ వేసి నీటి కేటాయింపులు తేలే వరకు కృష్ణా నీళ్లల్లో ఏపీ, తెలంగాణకు చెరి సగం వాటా ఇవ్వాలని కోరారు. 

ఏపీ కోటా 24 శాతమేనని క్లారిటీ 
శ్రీశైలం కరెంట్‌‌‌‌ ఉత్పత్తిలో తెలంగాణకు 76 శాతం వాటా ఉండగా, ఏపీ కోటా 24 శాతమేనని ఈఎన్సీ మురళీధర్​ తేల్చిచెప్పారు. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆర్‌‌‌‌ఎంసీ రిపోర్టులో చేర్చకుంటే తెలంగాణను కృష్ణా బోర్డు పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లేనని పేర్కొన్నారు. అలాంటప్పుడు డ్రాఫ్ట్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ను తాము ఆమోదించి సంతకం చేయలేమన్నారు. అదే సమయంలో ఆర్‌‌‌‌ఎంసీ ఐదో మీటింగ్‌‌‌‌కు తాము హాజరవడంలోనూ అర్థం లేదని పేర్కొన్నారు.