35 లక్షల మంది ఐటీ రీఫండ్స్ ఆగినయ్: నితిన్ గుప్తా

35 లక్షల మంది ఐటీ రీఫండ్స్ ఆగినయ్: నితిన్ గుప్తా
  • సీబీడీటీ చైర్​పర్సన్​ నితిన్​ గుప్తా వెల్లడి
  • చెల్లింపు కోసం స్పెషల్​ కాల్​ సెంటర్​ 

న్యూఢిల్లీ: 35 లక్షల మంది ఎసెసీలకు రీఫండ్స్​ చెల్లించడంలో ఇన్​కంటాక్స్​ డిపార్ట్​మెంట్​కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సీబీడీటీ చైర్​పర్సన్​ నితిన్​ గుప్తా మంగళవారం వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుల బ్యాంకు అకౌంట్ల వాలిడేషన్​సమస్యలే దీనికి కారణమని పేర్కొన్నారు. దీంతో ఎసెసీలను చేరడం కోసం స్పెషల్​ కాల్​ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వీలైనంత త్వరలో ఈ సమస్యలు పరిష్కరించి, రీఫండ్​లు చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. 

ఎసెసీలకు చెందిన సరైన బ్యాంకు అకౌంట్లలో రీఫండ్​ను జమ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. 2010–11 నాటి పాత డిమాండ్స్​ఎసెసీలకు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నకు నితిన్​ గుప్తా వివరణ ఇచ్చారు. ఇన్​కంటాక్స్​ డిపార్ట్​మెంట్​ తన టెక్నాలజీని 2011 టైములో మార్చుకుందని, అప్పుడే పేపర్​బేస్డ్​ రిజిస్టర్ల నుంచి కంప్యూటర్లకు మారిందని ఆయన చెప్పారు. ఆ కారణం వల్లే కొంత మంది ఎసెసీలకు పాత డిమాండ్స్​ కనబడుతున్నాయని వివరించారు. 

అయితే, కిందటేడాది నుంచే యూనిక్​ డిమాండ్​ మేనేజ్​మెంట్​ ఫెసిలిటేషన్​ సిస్టమ్​ను అమలులోకి తెచ్చామని,   రీఫండ్స్​ ఆగిపోయిన ఎసెసీల  కోసమే ఈ సిస్టమ్​ పని చేస్తోందని అన్నారు. పన్ను చెల్లింపుదారులందరికీ ఒక ఈ–మెయిల్​ పంపామని, అది అందిన నాటి నుంచి మూడు రోజులలోపు వారికి తమ డిపార్ట్​మెంట్​ కాల్​ సెంటర్​ నుంచి  ఒక ఫోన్​ కాల్​ వస్తుందని అందులో పేర్కొన్నామని, ఆ విధంగా ఎసెసీల రీఫండ్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని గుప్తా  చెప్పారు. మైసూరులోని కాల్​ సెంటర్​ ద్వారా కిందటేడాది 1.40 లక్షల రీఫండ్​ కేసులను పరిష్కరించగలిగినట్లు వెల్లడించారు. 

అయితే, తాము పంపే డిమాండ్​ను ఎసెసీ ఒప్పుకోవచ్చని లేదంటే కంటెస్ట్​ చేసేందుకూ వారికి అవకాశం ఉంటుందని గుప్తా చెప్పారు. తొలి దశలో కర్నాటక, గోవా, ముంబై, ఢిల్లీ, నార్త్​–వెస్ట్​ రేంజ్​ల కోసం కాల్​ సెంటర్​ పనిచేసేదని, ఇప్పుడు దానిని అన్ని ఇతర ప్రాంతాలు, సిటీల కోసమూ పనిచేయించనున్నామని వివరించారు. రీఫండ్స్​ ఆగిపోవడానికి సాధారణంగా రెండు కారణాలుంటాయని....ఒకటి ఎసెసీలు తమ బ్యాంకు అకౌంట్లను వాలిడేట్​ చేయకపోవడమని, లేదంటే ఆ ఎసెసీ అకౌంటుండే బ్యాంకు వేరే బ్యాంకులో మెర్జ్​ కావడమని గుప్తా చెప్పారు. కాకుంటే, ఎసెసీ వేరే ఏదైనా సిటీకి మారడం వల్ల ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లో మార్పు ఉండటం వల్ల కూడా రీఫండ్​ ప్రాసెస్​నిలిచిపోవచ్చని వివరించారు.

బ్యాంకు అకౌంట్లను వాలిడేట్​ చేసుకోండి...ఎసెసీలకు సూచన

ట్యాక్స్​ పేయర్లందరూ తమ బ్యాంకు అకౌంట్లను వాలిడేట్​ చేసుకోవాల్సిందిగా గుప్తా కోరారు. పైన పేర్కొన్న కారణాల వల్ల 35 లక్షల మందికి రీఫండ్​ నిలిచిపోయిందని, తాము చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని సీబీడీటీ చైర్​పర్సన్​ చెప్పారు. 2023–24 ఎసెస్​మెంట్​ ఇయర్​కు గాను 7.27 కోట్ల రిటర్నులు ఫైలయ్యాయి. ఎసెసీలు వాటి వెరిఫికేషన్​ కూడా పూర్తి చేశారు. ఇందులో 6.80 కోట్ల మంది ఎసెసీల రిటర్నుల ప్రాసెసింగ్​ను ఐటీ డిపార్ట్​మెంట్ పూర్తి చేసింది. 

అంటే,  వెరిఫైడ్​ ఐటీఆర్​లలో 93.50 శాతం రిటర్నుల ప్రాసెసింగ్​ పూర్తయినట్లు. కార్పొరేట్లలో 60 శాతం తమ లాభాలను కొత్త ట్యాక్స్​ రెజీమ్​ కిందనే ఫైల్ చేశారని, వ్యక్తులలో కూడా 60–70 శాతం మంది కొత్త విధానానికి మారతారని తాము ఆశిస్తున్నామని గుప్తా వెల్లడించారు. ఇప్పటిదాకా మొత్తం రూ. 9.57 లక్షల కోట్ల డైరెక్ట్​ ట్యాక్స్​లు వసూలయినట్లు పేర్కొన్నారు.