సైబర్ మోసం: స్టాక్ ట్రేడింగ్ లో లాభాలు వచ్చే చిట్కాలు చెప్తామని.. రూ.12 లక్షలు కొట్టేశారు

సైబర్ మోసం:  స్టాక్ ట్రేడింగ్ లో లాభాలు వచ్చే చిట్కాలు చెప్తామని.. రూ.12 లక్షలు కొట్టేశారు

సైబర్ నేరాగాళ్ల వలలో చిక్కుకుని మరో మహిళ భారీగా డబ్బులు పోగొట్టుకుంది. ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ చిట్కాలు చెబుతామని 36 ఏళ్ల మహిళ బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

వివరాల్లోకి వెళితే..  భయాందర్ సమీపంలోని ఉత్తాన్ తీర ప్రాంతంలో నివసిస్తున్న 36 ఏళ్ల మహిళ, స్టాక్ ట్రేడింగ్‌లో లాభదాయకమైన లాభాలను పొందేందుకు ఉపయోగపడే చిట్కాలను అందిస్తామని చెప్పడంతో మోసపోయింది. షేర్ ట్రేడింగ్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన రీల్‌ను తాను చూశానని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఆ లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత, ఆమెకు తెలియని ఓ వాట్సాప్ గ్రూప్‌ను పంపించారు. అందులో స్టాక్‌లను కొనడానికి.. విక్రయించడానికి ఉచిత ట్రేడింగ్ చిట్కాలను అందించడం ద్వారా పెట్టుబడి పెట్టి లాభాలు పొందొచ్చని బాధితురాలిని ఆకర్షించారు.

అడ్మిన్‌లలో ఒకరితో బాధితురాలు తన పర్సనల్ వాట్సాప్ నంబర్‌లో ఇంటరాక్ట్ అయ్యింది.  భారీ లాభాలను సంపాదించడం కోసం ట్రేడింగ్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయమని మహిళకు చెప్పారు. దీంతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని బాధితురాలు మోసపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి మే 5 మధ్య 20 రోజుల వ్యవధిలో పది లావాదేవీల ద్వారా మొత్తం రూ.11.76 లక్షలకు పైగా నిర్దిష్ట బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది.

ఆమె పెట్టిన పెట్టుబడికి దాదాపు రూ.45 లక్షల లాభం వచ్చిందని మెసేజ్ వచ్చినప్పటికీ.. ఆమె ఆ మొత్తాన్ని  విత్ డ్రా చేసుకోలేకపోయింది. 30 శాతం పన్నుల రూపంలో రూ. 16 లక్షలు చెల్లిస్తేనే డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు సాధ్యమవుతుందని బాధితురాలిని నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నించారు. అయితే, ఆమె అందుకు నిరాకరించడంతో.. బాధితురాలి నంబర్ బ్లాక్ చేసి.. గ్రూప్ నుండి తొలగించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఉత్తాన్ కోస్టల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.