జమ్మూ కాశ్మీర్‎లో 200 మీటర్ల లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 9 మందికి గాయాలు

జమ్మూ కాశ్మీర్‎లో 200 మీటర్ల లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 9 మందికి గాయాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లోని దోడా జిల్లాలోఘోర ప్రమాదం జరిగింది. సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం 200 మీటర్ల  లోతు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు సైనికులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తోన్నట్లు తెలిపారు. 

భదేర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి ఖన్నీ టాప్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఎత్తైన పోస్ట్ వైపు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగుల లోతైన లోయలో పడిపోయినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 17 మంది ఉన్నట్లు వెల్లడించారు. 

సమాచారం అందిన వెంటనే సైన్యం, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది సైనికులు గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు సిబ్బందిని ప్రత్యేక చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్నట్లు అధికారులు పేర్కొన్నారు.