
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నవంబర్ 3 నుంచి 28 వరకు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకోసం 4 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచనుంది. రాష్ట్రానికి వచ్చే జాతీయ నేతలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు ఈ హెలికాప్టర్లను వినియోగించుకోనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పార్టీ జాతీయ నేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించనున్న ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర పార్టీలోని ఓ నేత వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి ఎక్కువ దూరం ఉన్న ప్రాంతాల్లో నిర్వహించనున్న సభలకు వెళ్లేందుకు వీలుగా వీటిని ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు, స్టార్ క్యాంపెయినర్ హోదా కలిగిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రాజాసింగ్, అర్వింద్, రఘునందన్ రావు వంటి వారు కూడా వీలును బట్టి ప్రచార సభలకు చీఫ్ గెస్టులుగా వెళ్లేందుకు వీటిని వాడతారని తెలిపారు.