సింగపూర్ జూలో నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్

సింగపూర్ జూలో నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్

సింగపూర్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశ ప్రజలతో పాటు.. 'సింగపూర్‌ జూ'' ని కూడా తాకింది కరోనా. సింగపూర్‌ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన నైట్‌ సఫారీ జంతు ప్రదర్శనశాలలోని  నాలుగు ఆసియా సింహాలకు కరోనా పాజిటివ్‌ సోకినట్లు వైల్డ్‌లైఫ్‌ గ్రూప్‌లోని పరిరక్షణ, పరిశోధన, వెటర్నరీ వైస్‌ ప్రెసిడెంట్‌, జూ ఆపరేటర్‌ డాక్టర్‌ సోంజా లూజ్‌ తెలిపారు.

సాధారణంగా జంతువులు వైరస్‌ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురికావని... కొద్దిపాటి సహాయక చికిత్సతో సింహాలు పూర్తిగా కోలుకుంటాయని అన్నారు డాక్టర్  సోంజూ. అయితే.. ఆ తర్వాత అవసరమైతేనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు, యాంటీబయాటిక్స్‌ ఇస్తామన్నారు. సింహాల్లో గత రెండు రోజులుగా దగ్గు, తుమ్ములు, నీరసంతో పాటు తేలికపాటి లక్షణాలు కనిపించాయని చెప్పారు. అంతేకాదు.. నైట్‌ సఫారీకి చెందిన ముగ్గురు సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు వైల్డ్‌ లైఫ్‌ గ్రూప్‌ తెలిపిందని.. దీంతో నైట్‌ సఫారిని మూసేసినట్లు అధికారులు తెలిపారు.