
సినిమాల ఎఫెక్ట్ బాగా పని చేస్తుంది.. సినిమాలోని సీన్స్ ను అచ్చుగుద్దినట్లు రియల్ గా చేసేస్తున్నారు కిలాడీలు. హీరో సూర్య, రమ్యకృష్ణ నటించిన గ్యాంగ్ సినిమా చూసి ఉంటారు కదా.. అందులో ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ల వేషంలో దోపిడీలు చేస్తుంటారు కదా.. సేమ్ టూ సేమ్.. అచ్చం అలాగే మహారాష్ట్రలో ఓ రియల్ సీన్ జరిగింది. ఓ పెద్ద డాక్టర్ ఇంట్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర రాష్ట్రం సాంగ్లీ జిల్లా కేంద్రం. ప్రముఖ డాక్టర్ జగన్నాథ్ మెత్రే. ఇతనికి పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి ఉంది. సిటీలోనే పెద్ద ఇంట్లో నివాసం. 2025, సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటలు. ఇంట్లో డాక్టర్ మెత్రే, అతని భార్య మాత్రమే ఉన్నారు. రాత్రి 11 గంటలకు ముగ్గురు మగాళ్లు.. ఓ మహిళ వచ్చారు. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి వస్తున్నాం.. మీ ఇంట్లో తనిఖీలు చేయాలని చెప్పారు. దాని కోసం వాళ్లు వారెంట్ కూడా చూపించారు. ఇంట్లోకి వస్తూనే సెల్ ఫోన్లు తీసేసుకున్నారు. ఇల్లు మొత్తం సోదా చేశారు.
డాక్టర్ ఇంట్లోని బీరువాల్లో ఉన్న 16 లక్షల డబ్బు, కిలో బంగారం, ఇతర ఆభరణాలు అన్నింటినీ ఓ చోట చేర్చారు. వాటికి లెక్కలు అడిగారు. అన్నింటికీ సమాధానం చెప్పారు డాక్టర్. మొత్తంగా 2 కోట్ల రూపాయల విలువైన డబ్బు, బంగారం ఆభరణాలను వెత్తుకెళ్లారు. సోదాల సమయంలోనే డాక్టర్ కు వాళ్లపై అనుమానం వచ్చింది.. అయినా ఏమీ చేయలేకపోయారు. పోలీసులకు కంప్లయింట్ చేద్దాం అనుకున్నా ఫోన్లు అందుబాటులో లేవు. దీంతో వాళ్లకు సహకరించారు. మధ్యలో డాక్టర్ వాళ్ల వివరాలు అడిగితే.. వాళ్ల ఐడీ కార్డులు చూపించారు. కోర్టు నుంచి తీసుకొచ్చిన సెర్చ్ వారెంట్, ఇతర కాగితాలు అన్నీ చూపించారు.
ALSO READ : మహిళా అధికారిణి ఇంట్లో సోదాలు..
వాళ్లు వెళ్లిన తర్వాత డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వాళ్లు ఎవరూ కూడా వచ్చినట్లు చెప్పలేదు. దీంతో కంప్లయింట్ ఇచ్చారు డాక్టర్ మెత్రే. పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేయగా.. వచ్చినోళ్లు ఫేక్ ఆఫీసర్లు అని.. నకిలీ వ్యక్తులని స్పష్టం అయ్యింది. తెలుగులో హీరో సూర్య గ్యాంగ్ సినిమా.. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 సినిమా తరహాలో ఈ ఘటన జరిగినట్లు నిర్థారించుకున్నారు. సాంగ్లీ సిటీలో గురుకృప అనే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిస్తున్నారు డాక్టర్ జగన్నాథ్ మెత్రే. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.