జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో నలుగురు టెర్రరిస్టులు హతం.. భారీగా ఆయుధాలు సీజ్

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో నలుగురు టెర్రరిస్టులు హతం.. భారీగా ఆయుధాలు సీజ్

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని సిధ్రా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలం వద్ద భారీ ఆయుధాలు లభ్యమయ్యాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేలో ఉన్న సిధ్రా బైపాస్ ప్రాంతంలో ఉదయం 7.30 గంటలకు కాల్పులు జరిగాయి. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశంలోకి టెర్రరిస్టులు చొరబడే ప్రమాదముందనే ముందస్తు సమాచారంతో సిధ్రా దగ్గర తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళుతున్న ఓ ట్రక్కును ఆపి సెర్చ్ చేస్తుండగా దాని లోపల దాక్కొని ఉన్న టెర్రరిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు. దాంతో తాము ఎదురుకాల్పులకు దిగామన్నారు.

45 నిమిషాలకు పైగా జరిగిన ఈ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో నలుగురు టెర్రరిస్టులు చనిపోయారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో డీజిల్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ పేలడంతో ట్రక్కుకు మంటలంటుకున్నాయని చెప్పారు. అయితే, ట్రక్ డ్రైవర్ తప్పించుకున్నాడని జమ్మూ జోన్  ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. ట్రక్కు లోపలి నుంచి మృతదేహాలను బయటకు తీశామని.. ఏడు ఏకే అసాల్ట్ రైఫిల్స్, ఒక ఎమ్4 రైఫిల్, 3 పిస్టల్స్, పెద్ద మొత్తంలో పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ నలుగురు టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి చొరబడినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దేశంలో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది మరింత అప్రమత్తమయ్యాయి.