తిరుమల కొండపై దోపిడీ దొంగలు : తమిళనాడు భక్తుడి కారు అద్దాలు పగలగొట్టి బంగారం చోరీ

తిరుమల కొండపై దోపిడీ దొంగలు : తమిళనాడు భక్తుడి కారు అద్దాలు పగలగొట్టి బంగారం చోరీ

తిరుమల కొండపై ఘోరం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా దోపిడీ దొంగలు తెగబడ్డారు. వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం కొండకు వచ్చారు తమిళనాడు భక్తులు. చెన్నై నుంచి కారులో వచ్చిన భక్తులు.. కొండపైన ఉన్నటువంటి నారాయణగిరి గదుల సముదాయానికి చెందిన కారు పార్కింగ్ దగ్గర.. తమ కారును పార్క్ చేశారు భక్తులు. శ్రీవారి దర్శనానికి వెళుతూ కారులోనే సెల్ ఫోన్లు, కొన్ని విలువైన వస్తువులు, బంగారం ఉంచి వెళ్లారు. శ్రీవారి దర్శనం తర్వాత వచ్చి చూస్తే.. కారు అద్దాలు పగిలి ఉన్నాయి. ఈ ఘటన తిరుమల కొండపై ఉన్న పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

బుధవారం ( ఆగస్టు 14 ) రాత్రి తిరుమలలోని నారాయణగిరి కార్ పార్కింగ్ దగ్గర  జరిగింది ఈ ఘటన. పార్క్ చేసి ఉన్న కార్ అద్దాలను పగలగొట్టి కారులో చోరీకి పాల్పడ్డారు దుండగులు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. చోరికి గురైన కారు తమిళనాడుకు చెందిన భక్తులదని సమాచారం. ఏడుకొండలవాడిని దర్శించుకుందామని వస్తే.. ఆ శ్రీవారి సన్నిధిలోనే దొంగతనం జరగడంతో షాక్ కి గురైన భక్తులు చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తున్నాయని.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇలాంటి ఘటనలు ప్రశాంతతను దూరం చేస్తున్నాయని అంటున్నారు భక్తులు. తిరుమల కొండపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు శ్రీవారి భక్తులు.