ఏపీలో దసరాకు 4వేల ప్రత్యేక బస్సులు

ఏపీలో దసరాకు 4వేల ప్రత్యేక బస్సులు
  • స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీ పెంపు

అమరావతి: దసరా పండుగ సందర్భంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులపై అధిక రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తామని ఆయన తెలిపారు. రెగ్యులర్ గా తిరిగే బస్సు సర్వీసుల్లో అదనపు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో అన్ని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమలు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వివరించారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనా.. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని తెలిపారు. ఆర్టీసీ విలీనానంతరం కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, డీజిల్ ధరల పెరుగుదలతో సంస్థపై భారం పెరిగిందని ఆయన వివరించారు. 
ఆర్టీసీలో నిర్వహణ వ్యయం తగ్గించేందుకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని,  సంస్థపై పడుతోన్న భారం, నష్టాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఆర్ధికంగా భారం పడుతున్నా.. ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచన లేదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు.