జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్స్

జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్స్
  • రాష్ట్రం నుంచి హాజరుకానున్న 40 వేల మంది విద్యార్థులు 

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్స్ సెషన్–1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సారి తెలంగాణ నుంచి 40 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 ప్రధాన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్, కోదాడ, పెద్దపల్లి తదితర పట్టణాల్లో ఆన్​లైన్ సెంటర్లు సిద్ధం చేశారు.

ఈ నెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. చివరి రోజు 29న మాత్రమే పేపర్ –2 బీఆర్క్, బీప్లానింగ్ కోసం పరీక్ష కొనసాగనున్నది. మిగిలిన అన్ని సెషన్లు కూడా బీఈ, బీటెక్ కోసమే ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని, విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.