తెలంగాణలో 41 కొత్త బార్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు రూ.లక్ష ఫీజు

తెలంగాణలో 41 కొత్త బార్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు రూ.లక్ష ఫీజు
  • క్యూర్ పరిధిలో 14, జిల్లాల్లో 27 బార్లు
  • అక్టోబర్12 వరకు గడువు 
  • ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 41 కొత్త ‘2బీ’ బార్ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌‌‌‌గిరి రీజియన్లలో 14 బార్లకు, మిగిలిన జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో 27 బార్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషనర్ హరికిరణ్ ప్రకటించారు. కొత్త మున్సిపాలిటీల ఆవిర్భావం, మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీనం కారణంగా పెరిగిన జనాభా దామాషాను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త బార్ల ఏర్పాటుకు అనుమతినిచ్చారు. ఒక్కో దరఖాస్తుకు లక్ష రూపాయలు నాన్-రీఫండబుల్ ఫీజుగా నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్12వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించడానికి గడువు విధించారు.

దరఖాస్తుదారులు కేవలం ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5  గంటల లోపు మాత్రమే తమ ఫారాలను అందజేయాల్సి ఉంటుంది. క్యూర్ పరిధిలోని14 బార్లకు నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ కమిషనర్ కార్యాలయంతో పాటు ఆయా ప్రాంతాల డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా జిల్లాల బార్లకు సంబంధించి హైదరాబాద్‌‌‌‌లోని కమిషనర్ కార్యాలయం, ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్ ఆఫీసులు, సంబంధిత డీపీఈవో కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు.