నైనీలో బొగ్గు ఉత్పత్తి జోరు.. రవాణా డౌన్.. గుట్టలుగా నిల్వలు

నైనీలో బొగ్గు ఉత్పత్తి జోరు.. రవాణా డౌన్.. గుట్టలుగా నిల్వలు
  • రోజుకు 25 వేల టన్నుల ఉత్పత్తి
  • 8 వేల టన్నుల లోపే రవాణా
  • పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు
  • ఉత్పత్తి తగ్గిస్తున్న కాంట్రాక్టర్
  • రైల్ కారిడార్ పూర్తి కాక రవాణా కష్టాలు

హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని సింగరేణికి చెందిన నైనీ కోల్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌లో బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్నది. కానీ, ఆ స్థాయిలో రవాణా కావడం లేదు. రోజుకు 25 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంటే, రాష్ట్రానికి కేవలం 8 వేల నుంచి 10 వేల టన్నుల లోపే సప్లై అవుతున్నది. ఉత్పత్తి పెరిగి రవాణా తగ్గడంతో గని వద్ద గుట్టలు గుట్టలుగా బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో స్థలం లేక కాంట్రాక్టర్ ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. 

రైల్ కారిడార్ పూర్తి కాకపోవడంతోనే రవాణా కష్టాలు ఏర్పడినట్లు సింగరేణి అధికారులు చెబుతున్నారు. గని దగ్గరికి రైల్వే మార్గం పూర్తి కావడానికి మరో మూడేండ్లు పట్టవచ్చని అంటున్నారు. దీనివల్ల బొగ్గు గని నుంచి రైల్వే సైడింగ్ వరకు సుమారు 54 కి.మీ దూరం లారీల్లోనే బొగ్గు తరలించాల్సి వస్తోంది. లారీల రాకపోకలతో శబ్దాలు భరించలేకపోతున్నామని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది. ఒడిశా ప్రభుత్వ సహకారంతో రాత్రి 10 తర్వాతే లారీలకు అనుమతి ఇచ్చారు. అయినా నాణ్యమైన బొగ్గు కోసం ఎదురుచూస్తున్న జెన్​కోకు రవాణా కష్టాలు తప్పడం లేదు.

పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు..

రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నెముకగా నిలిచే ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని 2015 ఆగస్టు 13న కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించింది. ఈ కోల్ బ్లాక్‌‌‌‌‌‌‌‌లో అత్యుత్తమ జీ-10 గ్రేడ్ గల మొత్తం 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏటా 10 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంతో 36 ఏండ్లపాటు ఈ గని సేవలందించాల్సి ఉంది. అయితే అనుమతుల సాధనలో ఎదురైన ఎన్నో అడ్డంకులను ఛేదిస్తూ పదకొండేండ్ల తర్వాత 2025 ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 

గడిచిన 16 నెలల కాలంలో ఇప్పటివరకు 20 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. రవాణా ఇబ్బందులను అధిగమించి నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు 2026 ఆగస్టు 6న తెలంగాణ గడ్డపైకి చేరుకుంది. సుమారు 1,131 కి.మీ దూరం ప్రయాణించి జైపూర్ సింగరేణి థర్మల్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నది. ఆ తర్వాత మరో వారానికి తొలి రైల్వే రేకు యాదాద్రి ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు (వైటీపీఎస్) వచ్చింది. 

గని నుంచి రైల్వే సైడింగ్ వరకు 54 కి.మీ దూరం బొగ్గు రవాణా చాలా కష్టంగా మారింది. రోజుకు 25 వేల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి జరుగుతుంటే, కేవలం 8 వేల నుంచి 10 వేల టన్నుల వరకే రవాణా జరుగుతుండటంతో ఇప్పటికే అక్కడ 20 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు గుట్టలుగా పేరుకుపోయినట్లు సింగరేణి అధికారులు చెబుతున్నారు.

బొగ్గు రవాణా కష్టాలు..

రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు నైనీ నుంచి రోజుకు 40 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 14 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉన్నది. నైనీ బొగ్గు గని వరకు రైల్ కారిడార్ పూర్తికాకపోవడం వల్ల ఈ కష్టాలు ఎదురవుతున్నాయి. కామన్ కోల్ కారిడార్ రైల్వే లైన్ (సీసీఆర్ఎల్) పేరిట రూ.1,700 కోట్లతో కేంద్ర ప్రభుత్వం 68 కిలోమీటర్ల దూరం రెండు దశల్లో రైల్వే లైన్ వేయడానికి పనులు చేపట్టింది. 

తొలి దశలో అంగూల్ నుంచి బలరాం వరకు 14 కిలోమీటర్ల దూరం చేపట్టిన రైల్వే లైన్ 2022 నవంబర్‌‌‌‌‌‌‌‌లో పూర్తయింది. బలరాం నుంచి పుటగడియా, జరపాద, తెంతులోయి వరకు చేపట్టిన 54 కిలోమీటర్ల రైల్వే పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. మరో మూడేండ్లపాటు పనులు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోడ్డు మార్గంలో లారీల ద్వారా బొగ్గు రవాణా చేయడానికి ఒడిశా ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థ 2030 వరకు అనుమతి తీసుకున్నది.

రాత్రి 10 తర్వాతే లారీలకు అనుమతి..

నైనీ బొగ్గు గని వరకు రైల్వే లైన్ పూర్తికాకపోవడంతో రాష్ట్ర అవసరాలకు ఉపయోగించే బొగ్గును లారీల్లో లోడ్ చేసి 54 కి.మీ దూరంలో ఉన్న రైల్వే సైడింగ్ వరకు రవాణా చేస్తున్నారు. యాదాద్రి, సింగరేణి పవర్ స్టేషన్ల కోసం రోజుకు 8 వేల టన్నుల బొగ్గు సప్లై చేయడానికి 200 లారీలకు పైగా ఉపయోగిస్తున్నారు. ఈ రోడ్డు మార్గంలో భారీ ట్రక్కుల కదలిక వల్ల ప్రమాదాలు జరగడం, కాలుష్యం పెరగడం, రోడ్లు పాడవడం వంటి కారణాలతో లోకల్ ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురుచూస్తున్నాయి. 

కొన్ని రోజులపాటు లారీలు తిరగకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఒడిశా ప్రభుత్వ సహకారంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లారీలు నడిచేలా ప్రజలను ఒప్పించారు. దీంతో కేవలం రోజుకు 8 వేల నుంచి 10 వేల టన్నుల వరకు మాత్రమే రైల్వే లైన్ వరకు బొగ్గు రవాణా జరుగుతున్నది. 

అదనపు లారీల కోసం టెండర్లు పిలిచిన జెన్​కో..

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాలని జెన్​కో సంస్థ భావిస్తున్నది. వైటీపీఎస్​లో ప్రస్తుతం 3,200 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి పూర్తి స్థాయి నిర్వహణకు రోజుకు సుమారు 32 వేల మెట్రిక్ టన్నుల నాణ్యమైన జీ-9, జీ-10 బొగ్గు అవసరం ఉన్నది. దీంతో నైనీ బొగ్గు గని దగ్గర ఉన్న నిల్వలను రాష్ట్రానికి తరలించడానికి, గని నుంచి రైల్వే లైన్ వరకు రవాణా కోసం అదనపు లారీల కోసం జెన్​కో సంస్థ టెండర్లు పిలిచింది.