- శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్,
- బీసీ కమిషన్ కార్యాలయంలో ఘనంగా కొండా జయంతి వేడుకలు
హైదరాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమ నేతగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తన పదవులను సైతం త్యాగం చేశారని గుత్తా కొనియాడారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఆనాడే గళమెత్తి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన నాయకుల్లో బాపూజీ అగ్రగణ్యులని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా, తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడి పనిచేశారని అన్నారు. “పదవుల కంటే ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని తన ఆచరణ ద్వారా నిరూపించిన మహనీయుడు బాపూజీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని గుత్తా అన్నారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, విప్ అద్దంకి దయాకర్, శాసన సభ సెక్రటరీ తిరుపతి తదితరులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి బీసీ కమిషన్ నివాళి..
బీసీ కమిషన్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ జి. నిరంజన్ మాట్లాడుతూ.. బాపూజీ నిరాడంబరత గల మనిషి అని, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని తెలిపారు. గ్రంథాలయాలు స్థాపించడంలో ఆయన పాత్ర మరువలేనిదని, తెలంగాణ కోసం తన మంత్రి పదవికి మొదటిసారిగా రాజీనామా చేసిన వ్యక్తి అని కొనియాడారు.
బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ మాట్లాడుతూ.. 1969లో ప్రసార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారని అన్నారు. సభ్యుడు జయప్రకాష్ మాట్లాడుతూ.. చాలా చిన్న గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని, కో-ఆపరేటివ్ సొసైటీస్ స్థాపించడంలో ఆయన పాత్ర మరువలేనిదని అన్నారు. సభ్యురాలు బాల లక్ష్మి మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.
