స్వాతంత్ర్యానంతర దళిత జీవితం తెలుగు సాహిత్యంలో 1990ల తర్వాతే గణనీయంగా రికార్డు కావడం మొదలైంది. అంతకుముందు దళిత జీవితాలపై రాసినవారిలో ఎక్కువమంది దళితేతరులే. దళితులు తమ జీవితాలను తామే రాసుకునే చైతన్యాన్ని అస్తిత్వోద్యమాలు తీసుకొచ్చాయి. కారంచేడు, చుండూరు ఘటనల తర్వాత దళిత సాహిత్యం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. దళిత్ పాంథర్స్ ఉద్యమం కూడా తెలుగు దళిత కవులను ప్రభావితం చేసింది. విప్లవ, అభ్యుదయ ఉద్యమాలతో దళిత సాహిత్యానికి సంబంధం ఏర్పడింది.
కుల సమస్యను వర్గ దృక్పథంలో అర్థం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. జి. కళ్యాణ్‌రావు, కలేకూరి ప్రసాద్, వేముల ఎల్లయ్య, ఎం. ఎఫ్. గోపీనాథ్ వంటి రచయితలు ఈ పరంపరలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కెంగార మోహన్ కవిగా, రచయితగా, విమర్శకునిగా చేస్తున్న కృషికి ఆయన కథలు నిదర్శనంగా నిలుస్తాయి. అంబేద్కరిజంలోనే కుల సమస్యకు పరిష్కారం ఉందనే విశ్వాసాన్ని ఆయన కథలు వ్యక్తం చేస్తాయి.
కాలం మారినా తీరు మారలేదు
కాలం మారినా దళితుల జీవితాల్లో కుల వివక్ష పూర్తిగా తొలగిపోలేదని రచయిత అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు, విద్య వల్ల దళితుల్లో ఆత్మగౌరవం, చైతన్యం పెరిగినా అంబేద్కర్ సూచించిన కుల నిర్మూలన ఇంకా ఆచరణలోకి రాలేదు. ఆధునిక కార్పొరేట్, మహానగర జీవితంలోనూ కులం తన రూపాన్ని మార్చుకుని దళితులను వెంటాడుతూనే ఉందని చెప్తున్నారు.
గతంలో బహిరంగంగా కనిపించిన వివక్షకు బదులు ఇప్పుడు కనిపించని రూపాల్లో వివక్ష, హింస కొనసాగుతున్నాయని ఆయన అంటున్నారు. దళితులపై దాడులు, వారికి రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలోని లోపాలు కూడా ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.
రిజర్వేషన్ రాజకీయాల ప్రతిఫలం
రిజర్వేషన్ల చుట్టూ జరుగుతున్న పరిణామాలు, ప్రైవేటీకరణ, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల సమస్య వంటి అంశాలను రచయిత ప్రస్తావించారు. మతం మారినా కులం మారడం లేదని, దళితుల సామాజిక వెనకబాటుతనం కొనసాగుతోందన్నారు. ఆహారపు అలవాట్ల చుట్టూ జరుగుతున్న రాజకీయాలను కూడా దళిత జీవితంలోని మరో సవాలుగా చూపించారు. తరతరాలుగా దళిత సంస్కృతిలో భాగమైన ఆహారాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారని ఆయన అభిప్రాయం. చదువు, ఉద్యోగం, రిజర్వేషన్లు, ఆహారం, ఓటు హక్కు వంటి అంశాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలోనే కెంగార మోహన్ ‘బ్లాక్ రెయిన్‌బో’ కథలను తీసుకొచ్చారని రచయిత చెప్పారు.
వర్గం కాదు, వర్ణమే!
‘బ్లాక్ రెయిన్‌బో’ కథల్లో ఆధునిక దళిత జీవితంలోని కులం, వలస, సామాజిక అసమానతల ప్రకంపనలు కనిపిస్తాయి. గ్రామాల్లో ఆధిపత్య కులాల మధ్య దళితులు ఎదుర్కొనే అవమానాలు, ప్రశ్నిస్తే ఎదురయ్యే పరిస్థితులు, బతుకుదెరువు కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితులను రచయిత కథల్లోకి తీసుకొచ్చారు. కులం ఒకవైపు, వలస మరోవైపు దళితుల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో ఈ కథలు చూపిస్తాయి. ఇవి వ్యక్తిగత విషాదాల కథలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని కూడా ఆవిష్కరిస్తాయి. ఈ కథల్లో దళిత యువత ఎదుర్కొనే దగా, గ్రామీణ దళిత వాడల్లోని విషాద జీవితం, మాదిగ వాడల్లోని బతుకులను కెంగార మోహన్ సజీవంగా ఆవిష్కరించారు. కథల్లోని కఠినమైన వాస్తవాలు పాఠకుడిని వెంటాడేలా ఉంటాయి.
మోహన్‌కు ముందు తరువాత
కెంగార మోహన్‌కు ముందు రాయలసీమ నుంచే నాగప్పగారి సుందర్రాజు ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యెదా’ వంటి కథతో దళిత జీవితంలోని వాస్తవాలను పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. అదే పరంపరలో కెంగార మోహన్ ఆధునిక దళిత జీవితంలోని దైన్యాన్ని, విషాదాన్ని కథలుగా మలిచారు. సంభాషణలు, కథన పద్ధతి, ముగింపుల్లో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కథల ముగింపులు కల్పితంగా అనిపించవు.
అవి వాస్తవ జీవితాల నుంచి వచ్చినవే కావడం వల్ల మరింత సజీవంగా అనిపిస్తాయి. అంబేద్కరిస్ట్ చైతన్యంతో సమాజాన్ని చూసినప్పుడు కులం అనేక రంగాలను ఎలా శాసిస్తుందో అర్థమవుతుందని రచయిత చెప్తున్నారు. రాయలసీమ దళిత కథలుగా కనిపించినా, ఇందులోని అనుభవాలు దేశంలోని దళితుల జీవితాలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయని పేర్కొంటున్నారు.
ఈ కథల్లో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, భాష పేరుతో పెరిగే దురభిమానం, మతం మారినా కులం మారని గ్రామీణ బతుకులు వంటి విభిన్న అంశాలు కనిపిస్తాయి. అయితే గ్రామాల్లో దళితుల దయనీయ స్థితినే ప్రధానంగా చిత్రించిన కథలు ఎక్కువ. మారుతున్న కాలంలోనూ కొనసాగుతున్న కుల వివక్షను, దాని ప్రభావాలను ప్రశ్నిస్తూ దళిత జీవితంలోని కనిపించని బాధను వెలుగులోకి తీసుకురావడమే ‘బ్లాక్ రెయిన్‌బో’ కథల ప్రత్యేకత.
- డా. పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
