ప్రభుత్వ స్కూల్ పిల్లలకు అన్న అక్కపాఠాలు.. డిగ్రీ స్టూడెంట్లతో ఏఐ క్లాసులు

ప్రభుత్వ స్కూల్  పిల్లలకు అన్న అక్కపాఠాలు.. డిగ్రీ స్టూడెంట్లతో ఏఐ క్లాసులు
  • డిగ్రీ, పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లతో కోడింగ్, ఏఐ క్లాసులు 
  • ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ పూర్తి చేసిన కాలేజీ విద్యార్థులకు అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రెడిట్లు 
  • పైలట్ ప్రాజెక్టు సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్టేట్ వైడ్ అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కోడింగ్ నైపుణ్యాలను నేర్పించేందుకు విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అన్న-అక్క మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్’ పేరిట ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల సీనియర్ విద్యార్థులతో హైస్కూల్ పిల్లలకు టెక్నికల్ క్లాసులు చెప్పించాలని నిర్ణయించింది. ఇటీవల చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. 

పైలట్ ప్రాజెక్ట్ సూపర్ హిట్

‘అన్న-అక్క మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్’ విధానాన్ని రాష్ట్రమంతటా విస్తరించే ముందు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.19 సర్కార్​బడులు,15 ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన 184 మంది విద్యార్థులు మెంటార్లుగా స్కూళ్లకు వెళ్లి విజయవంతంగా క్లాసులు నిర్వహించారు. దీని ద్వారా బడి పిల్లల్లో సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా పెరిగిందని అధికారుల సర్వేలో తేలింది. 

ఏకంగా 93% మంది మెంటార్లు, 86 % మంది స్కూల్ టీచర్లు ఈ కార్యక్రమం అద్భుతంగా ఉందని, తప్పకుండా కొనసాగించాలని ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వచ్చిన ఈ సానుకూల ఫలితాల ఆధారంగానే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

స్టూడెంట్లకు కోడింగ్, ఏఐ పాఠాలు

రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్స్, మోడల్ స్కూల్స్, గురుకులాలు, పబ్లిక్ స్కూళ్లు, కేజీబీవీలలోని ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకూ విద్యార్థులకు ఈ క్లాసులు జరుగుతాయి. బడి పిల్లలకు చిన్నప్పటి నుంచే కంప్యూటేషనల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, ప్రైమరీ కోడింగ్, ఏఐ కాన్సెప్టుపై పట్టు సాధించేలా ప్రాజెక్ట్ బేస్డ్ పద్ధతిలో బోధిస్తారు. దీనికోసం ఎస్సీఈఆర్టీ రూపొందించిన ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’పుస్తకాన్ని వినియోగించనున్నారు. 

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, యూజీసీ కమ్యూనిటీ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిబంధనల ప్రకారం డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇది ఫీల్డ్-బేస్డ్ టీచింగ్ ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణించబడుతుంది. డిగ్రీ 5, 6వ సెమిస్టర్ విద్యార్థులు, ఏఈడీపీ కోర్సుల 3, 4వ సెమిస్టర్ విద్యార్థులు, పాలిటెక్నిక్ 5వ సెమిస్టర్ స్టూడెంట్లు మెంటార్లుగా వ్యవహరిస్తారు. ప్రతి విద్యార్థి సమీప పాఠశాలలో కనీసం 30 గంటల పాటు బోధించాల్సి ఉంటుంది. ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ పూర్తి చేసిన స్టూడెంట్లకు వారి కోర్సుల్లో నాన్-సీజీపీఏ, సీజీపీఏ అకడమిక్ క్రెడిట్లు లభిస్తాయి. ప్రతి విద్యాసంవత్సరంలో జూలై నుంచి అక్టోబర్, తిరిగి జనవరి నుంచి మార్చి మధ్య ఈ ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ జరుగుతుంది. 

వర్సిటీలతో ట్రైనింగ్

స్కూళ్లకు వెళ్లే కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన బోధనా పద్ధతులు నేర్పించేందుకు క్యాస్కేడింగ్ శిక్షణ విధానాన్ని అమలు చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్, ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ తదితర వర్సిటీల ప్రొఫెసర్లు మాస్టర్ ఫ్యాకల్టీగా వ్యవహరించి కాలేజీ లెక్చరర్లకు ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం లెక్చరర్లు తమ విద్యార్థి మెంటార్లకు తర్ఫీదునిస్తారు. మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు telangana.codemitra.org అధికారిక పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  రూపొందించారు. 

విద్యార్థుల నమోదు, లెర్నింగ్ మెటీరియల్, క్లాస్ వర్క్, హాజరు, సర్టిఫికేషన్ ప్రక్రియ అంతా ఈ పోర్టల్ ద్వారానే కొనసాగుతుంది. విద్యార్థులకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా వారి కాలేజీకి దగ్గర్లోని స్కూళ్లనే కేటాయించాలని, గర్ల్స్ స్కూళ్లకు తప్పనిసరిగా మహిళా మెంటార్లనే నియమించాలని గైడ్ లైన్స్​లో పేర్కొన్నారు.