- హైదరాబాద్ సిటీలో రోజూ వచ్చే 8వేల టన్నులకు ఇది అదనం
- సిటీ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లెక్క ఇది
- హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా .. జిడ్డు, వ్యర్థాలు
- పారిశుధ్య కార్మికులు ఊడ్చినా రావట్లే
- నీటి ప్రెషర్‌తో తొలగిస్తున్న బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు : గణేశ్నిమజ్జనాల సందర్భంగా నగరవ్యాప్తంగా పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపుతో పాటు శానిటేషన్పనులను జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ముమ్మరం చేసింది. నిమజ్జన పాయింట్లు, శోభాయాత్ర సాగిన ప్రధాన మార్గాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి తొలగించింది. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌తో పాటు గణేశ్ శోభాయాత్రలు సాగిన మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో భారీగా చెత్త పేరుకుపోయింది. జిడ్డు, ఆహార వ్యర్థాలు, పూజా సామగ్రి రోడ్లపై పడేయడంతో అతుక్కుపోయి క్లీన్చేయడం జీహెచ్‌ఎంసీకి తలకు మించిన భారమవుతోంది.
ఈ ప్రాంతాల్లో అక్కడక్కడా వాహనాలు స్కిడ్ అవుతుండడంతో పారిశుధ్య కార్మికులతో ఊడ్పించారు. అయినా ఫలితం లేకపోవడంతో నీటి ప్రెషర్మెషీన్లతో తొలగింపు మొదలుపెట్టింది. మొత్తం ఆరు వాటర్ ప్రెజర్ మెషీన్లతో రోడ్లను క్లీన్చేస్తున్నారు. ముందుగా రోడ్లపై పేరుకుపోయిన చెత్తను సిబ్బంది ఊడ్చి తొలగించిన తర్వాత నీటి ప్రెషర్‌తో శుభ్రం చేస్తున్నారు. ఈ పనులు సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఎక్కడ చూసినా కలర్పేపర్లే..
పేపర్షాట్స్, కలర్పేపర్లు వాడొద్దని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పేపర్ షాట్లను తొలగించేందుకు గతేడాది లెక్కనే జటాయ్ యంత్రాన్ని వాడారు. రోడ్డుపై నుంచి నేరుగా మెషీన్లోపలకు వ్యర్థాలను తీసుకోవడమే దీని ప్రత్యేకత. అయినా.. రోడ్డుపై పేపర్లు అతుక్కుపోవడంతో వంద శాతం తీసేయలేకపోయింది.
జీహెచ్‌ఎంసీలో 6 వేల మెట్రిక్ టన్నులు
నగరవ్యాప్తంగా రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో కలిపి ఇది 13 వేల మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో సుమారు 15 వేల మంది శానిటేషన్ సిబ్బంది శానిటేషన్విధుల్లో పాల్గొంటున్నారు.
