తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులే.. కేసీఆర్ కాదు : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 

తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులే.. కేసీఆర్ కాదు : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 
  • సీఎం రేవంత్ రెడ్డి తొలి పర్యటన సిరిసిల్లలోనే.. తర్వాత సిద్దిపేట, గజ్వేల్ 
  • ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు
  • సీఎల్పీ మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులు మాత్రమేనని, కేసీఆర్ కాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఆదివారం సీఎల్పీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ తలకాయ పెట్టినా ప్రయోజనం ఉండేది కాదన్నారు. తెలంగాణ అంటే తామేనన్న కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కారని చెప్పారు.

ఈ సెప్టెంబర్‌‌‌‌లోనే సీఎం రేవంత్ రెడ్డి తొలి పర్యటన సిరిసిల్లలో, రెండో పర్యటన సిద్దిపేటలో, మూడో పర్యటన గజ్వేల్‌‌‌‌లో చేయబోతున్నారని తెలిపారు. కేసీఆర్‌‌‌‌ ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా కేటీఆర్‌‌‌‌ ఆ స్థాయిలో పనిచేయలేదన్నారు. కాంగ్రెస్‌‌‌‌ను బెదిరించడం మానేసి కేటీఆర్‌‌‌‌ తన సొంత భవిష్యత్తుపై ఆలోచించుకోవాలని సూచించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనడం ద్వారా కేటీఆర్ తెలంగాణ ద్రోహిగా మారారని ఆరోపించారు. రాబోయే 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, అవినీతి సొమ్ముతోనే కాంగ్రెస్‌‌‌‌పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

అక్రమ ఆస్తుల రక్షణ కోసమే రేవంత్‌‌‌‌ను టార్గెట్ చేస్తున్నారు.. 

బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అసైన్డ్, ఇనాం, ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు నిర్మించుకున్నారని దయాకర్ ఆరోపించారు. ఈడీ అటాచ్ చేసిన భూమి ఎలా డీట్యాచ్ అయిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హైడ్రా ద్వారా కోట్ల విలువైన స్థలాలను, 22-ఏ జాబితాలోని భూములను ప్రభుత్వం విముక్తి చేస్తుండటంతో తమ అక్రమ సంపాదనకు నష్టం వాటిల్లుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యమం కోసం జీవితాలను త్యాగం చేసిన వారికి ఇసుమంత సాయం చేయకుండా కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పిలుపునిస్తే 13 వేల మంది ఉద్యమకారులు సాయం కోసం వచ్చారని తెలిపారు. పార్టీలో కేటీఆర్, హరీశ్​రావుల వర్గాల్లో ఎటు ఉండాలో తేల్చుకోలేక బీఆర్ఎస్ నేతలు సతమతమవుతున్నారని అన్నారు. దేశంలో ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని దయాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకే జాతి మొక్కలని ఆయన తేల్చిచెప్పారు.