- పుంజుకున్న సౌదీ ఆయిల్ ఎగుమతులు..
- సెప్టెంబర్‌లో రోజుకి 60 లక్షల బ్యారెళ్ల ఎగుమతి
- అమెరికా నేవి రక్షణతో ఒమన్ తీరంలోని హార్మూజ్ గుండా రవాణా షురూ
న్యూఢిల్లీ: యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులతో ఘర్షణలు, పైప్‌లైన్‌పై డ్రోన్ దాడులు జరిగినప్పటికీ సౌదీ అరేబియా ముడిచమురు ఎగుమతులు సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ కంపెనీ కెప్లర్ డేటా ప్రకారం.. సెప్టెంబర్‌లో సౌదీ రోజువారీ చమురు ఎగుమతులు 60 లక్షల బ్యారెళ్లకు ఎగిశాయి. ఆగస్టులో నమోదైన 34 లక్షల బ్యారెళ్లతో పోలిస్తే ఇది ఏకంగా 80 శాతం పెరుగుదల. కీలకమైన ఈస్ట్-–వెస్ట్ పైప్‌లైన్ తాత్కాలికంగా మూతపడినప్పటికీ, ఒమన్ తీరంలో అమెరికా నేవి ఒక సెక్యూర్డ్ కారిడార్‌ను ఏర్పాటు చేయడంతో మళ్లీ హార్మూజ్ జలసంధి మీదుగా సౌదీ ఎగుమతులు జరుగుతున్నాయి.
మిగిలిన గల్ఫ్ దేశాలను కూడా కలుపుకుంటే ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు 1.32 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా సాగుతోంది. కాగా, హూతీలు ఎర్ర సముద్రంలోని బాబ్-ఎల్-మండేబ్‌లో రవాణాకు అంతరాయం కలిగించడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 110 డాలర్లకి చేరింది. సౌదీ నుంచి సరఫరా తిరిగి ప్రారంభం కావడంతో ఈ ఆయిల్ ధరలు 2శాతానికి పైగా తగ్గి 104.32 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. హార్మూజ్ జలసంధిలో రాకపోకలపై అమెరికా-–ఇరాన్ మధ్య సానుకూల చర్చలు నడుస్తుండటం మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశం.
