కార్పొరేట్ తరహాలో ‘క్రిటికల్ కేర్’.. మెదక్లో అందుబాటులోకి రానున్న అత్యవసర సేవలు

కార్పొరేట్ తరహాలో ‘క్రిటికల్ కేర్’.. మెదక్లో అందుబాటులోకి రానున్న అత్యవసర సేవలు
  • రూ.14 కోట్లతో జీ + 3 బిల్డింగ్​
  •  రూ.10 కోట్లతో ఎక్విప్​మెంట్

మెదక్, వెలుగు: మెదక్​ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.  రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, పాము కాటు తదితర అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లాల్సిన పనిలేకుండా జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలో క్రిటికల్ కేర్ విభాగం రెడీ అయ్యింది. 

అన్నీ సేవలు అందుబాటులోకి.. 

మెదక్​ పట్టణంలో గతంలో ఉన్న ఏరియా ఆస్పత్రి 2016లో మెదక్​ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా ప్రభుత్వాస్పత్రిగా అప్​ గ్రేడ్​ అయ్యింది. ఆ తర్వాత ఐసీయూ, డయాలసిస్, టీ హబ్, ఆక్సిజన్​ ప్లాంట్​వంటి  వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా పట్టణ శివారులో మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్​) ఏర్పాటైంది. దీంతో జిల్లా ప్రజలకు వైద్య సేవలు మెరుగయ్యాయి. 2024లో మెదక్​ లో ప్రభుత్వ మెడికల్​ కాలేజీ మంజూరు అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నర్సింగ్​ కాలేజీ కూడా మంజూరైంది.

ఈ క్రమంలో తెలంగాణా వైద్య విధాన పరిషత్​(టీవీవీపీ) పరిధిలో ఉన్న జిల్లా ప్రభుత్వాస్పత్రి, ఎంసీహెచ్​ డైరెక్టర్​ ఆఫ్ మెడికల్​ఎడ్యుకేషన్​(డీఎంఈ) పరిధిలోకి వెళ్లాయి. జిల్లా ప్రభుత్వాస్పత్రి గవర్నమెంట్​జనరల్​హాస్పిటల్​ (జీజీహెచ్​), ఎంసీహెచ్​ లు టీచింగ్​ హాస్పిటల్​లుగా మారగా, వివిధ విభాగాల స్పెషలిస్ట్​ డాక్టర్లు అందుబాటులోకి వచ్చారు. 

ఇప్పుడు రూ.14 కోట్లతో..  

ఇటీవల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు అనుబంధంగా క్రిటికల్​ కేర్​ విభాగం మంజూరైంది. రూ.14 కోట్లతో పట్టణ శివారు లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం పక్కనే జీ + 3 బిల్డింగ్​ నిర్మించారు. 108 బెడ్స్​ కెపాసిటీతో నిర్మించిన క్రిటికల్​ కేర్​ హాస్పిటల్​ లో ఎమర్జెన్సీ విభాగం, ఐసీయూ, ఆర్థోపెడిక్ వార్డు, ఈఎన్ టీ వార్డు, మానసిక వైద్య చికిత్స వార్డు, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సర్జికల్​వార్డుతోపాటు, డయాలసిస్ సెంటర్, ఆపరేషన్ థియేటర్​, స్కానింగ్​ రూమ్​, ఎక్స్​ రే రూమ్, ఆర్వో ప్లాంట్​ ఏర్పాటు చేశారు. 

త్వరలో ప్రారంభం..

క్రిటికల్​ కేర్​ హాస్పిటల్​ లోని ఆయా విభాగాల్లో రూ.10 కోట్లతో ఎక్విప్ మెంట్ సమకూర్చారు. కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో ఆయా విభాగాల్లో  బెడ్స్​, ఆక్సిజన్​ సరఫరాకు ఏర్పాట్లు చేశారు.  త్వరలో క్రిటికల్​ కేర్​ హాస్పిటల్​ ను ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు మెదక్​ లోనే మెరుగైన వైద్యం అందనుంది.