- నాలుగేండ్లలో పార్టీ మారిన 111 మంది ప్రజాప్రతినిధులు
- అందులో 26 శాతం మంది బీజేపీలో చేరిక
- ఎన్డీయే కూటమిలోని ఎన్ పీఎఫ్ పార్టీలోకి అత్యధికం
- ఏడీఆర్ తాజా రిపోర్టులో వెల్లడి
న్యూఢిల్లీ:ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి పోటీచేసి, గెలిచాక పార్టీ ఫిరాయించే జంపింగ్ జపాంగ్ లు ఎక్కువగా బీజేపీలోకే వెళుతున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా రిపోర్టులో తేలింది. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాలను, ఎన్నికల సమయంలో నేతలు సమర్పించే అఫిడవిట్లను పరిశీలించి గత నాలుగేళ్లకు సంబంధించిన పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వివరాలను ఏడీఆర్ తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 24న విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. 2022 నుంచి ఇప్పటి వరకు సాధారణ, ఉప ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులలో మొత్తం 111 మంది ప్రజాప్రతినిధులు తమ సొంత పార్టీని వీడి మరో పార్టీలో చేరారని పేర్కొంది. ఇందులో 26 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈ 111 మంది ప్రజాప్రతినిధులలో 26 శాతం మంది అంటే.. 29 మంది బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీలు మారిన ప్రజాప్రతినిధులను అత్యధికంగా చేర్చుకున్న పార్టీల్లో ఒకటిగా బీజేపీ నిలిచింది. ఈ జాబితాలో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్ పీఎఫ్) టాప్ లో ఉంది. ఇందులోకి ఏకంగా 29 శాతం మంది అంటే.. 32 మంది నేతలు జంప్ చేశారు. అయితే, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నాగా పీపుల్స్ ఫ్రంట్ లో చేరడం కాకుండా నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్ డీపీపీ) విలీనం ఫలితంగా జరిగింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పార్టీ ఫిరాయింపులు జరిగాయని, అత్యధికంగా నాగాలాండ్‌లో 32 మంది, బెంగాల్‌లో 20మంది, తెలంగాణలో 9, గోవా, పంజాబ్‌లలో చెరో 8 మంది ఉన్నారు. ‘ఎన్నికల సంఘం డేటా నిర్వహణలో లోపాలు, కొంత సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రిపోర్టులో అన్ని కేసులు కవర్ అయ్యాయని చెప్పలేం’ అంటూ ఏడీఆర్ వివరణ ఇచ్చింది.
బీజేపీలో చేరిన ఆ 29 మంది ఎవరు?
ఏడీఆర్ జాబితా ప్రకారం బీజేపీలో చేరిన 29 మంది ప్రజాప్రతినిధులలో ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు.. స్వాతి మాలీవాల్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ కుమార్ పాఠక్, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్ని, రాజిందర్ గుప్తా.. వీరంతా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎన్నికైన వారే కావడం గమనార్హం. ఎమ్మెల్యేలలో గోవా నుంచి 8 మంది(కాంగ్రెస్), గుజరాత్ నుంచి నలుగురు(కాంగ్రెస్), హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు ఉన్నారు. మణిపూర్‌కు చెందిన ఐదుగురు (జేడీయూ) ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి మారినట్లు నివేదిక పేర్కొంది. మిగిలిన వాళ్లలో ఉత్తరప్రదేశ్ నుంచి మనోజ్ కుమార్ పాండే(ఎస్పీ), మధ్యప్రదేశ్ నుంచి నిర్మలా సప్రే(కాంగ్రెస్), కర్నాటక ఎమ్మెల్యే జి.జనార్దన్ రెడ్డి (కేఆర్పీపీ విలీనం) ఉన్నారు.
26 మంది లోక్‌సభ ఎంపీలు
నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) లోకి 20 మంది ప్రజాప్రతినిధులు చేరారు. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, దాని లోక్‌సభ ఎంపీలలో 20 మంది తిరుగుబాటు చేసి, జూన్ 14న పెద్దగా తెలియని ఎన్‌సీపీఐలో విలీనమైనట్లు ప్రకటించారు. అదే సమయంలో దిగువసభలో (లోక్‌సభ) బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మద్దతు తెలిపారు.
జంపింగ్ జపాంగ్ నేతల్లో కాంగ్రెస్ పార్టీ 9 మందిని, శివసేన 8 మందిని, ఎన్‌పీపీ ఆరుగురిని, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ నలుగురిని పొందాయి. మరోవైపు, అత్యధికంగా ఎన్‌డీపీపీ నుంచి 25మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారగా, ఆ తర్వాత టీఎంసీ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది ఉన్నారు. తన విశ్లేషణ పరిధిలోని 543 మంది లోక్‌సభ ఎంపీలలో 26 మంది పార్టీలు మారినట్లు ఏడీఆర్ తేల్చింది. కాగా, ఈ నివేదికను ప్రస్తావిస్తూ దేశంలోని ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేసి మరింత కఠినతరం చేయాలని ఏడీఆర్ సూచించింది.
