సబర్మతిలో దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం

సబర్మతిలో దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం
  •     గుజరాత్​లోని సబర్మతి స్టేషన్​లో రైలును ప్రారంభించిన అమిత్ షా
  •     రాష్ట్రంలో రూ.1,542 కోట్ల రైల్వే ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన 

న్యూఢిల్లీ: గుజరాత్‌‌‌‌లోని సబర్మతిలో దేశంలోనే మొట్టమొదటి ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఆధారిత రైలును కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.1,542 కోట్లకు పైగా విలువైన పలు కీలక రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జి రైలు డీజిల్ -ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ డ్యూయల్-ఫ్యూయల్ విధానంతో నడుస్తుంది. సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలో రెండు 1,400 హెచ్‌‌‌‌పీ డ్రైవింగ్ పవర్ కార్‌‌‌‌లను ఈ రెండు ఇంధనాలతో నడిచేలా మార్పులు చేశారు. ఈ విధానం ద్వారా డీజిల్ వినియోగాన్ని దాదాపు 40% వరకు తగ్గించవచ్చు. ఇంధన ఖర్చులు తగ్గడంతోపాటు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర హానికారమైన వాయువులు గణనీయంగా తగ్గుతాయి. ప్రయాణ సౌలభ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

ప్రధాన ప్రాజెక్టుల వివరాలు..

అహ్మదాబాద్ డివిజన్ పరిధిలోని 404 కి.మీ మేర రూ.411 కోట్లతో ‘కవచ్’ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థకు కేంద్ర హోంమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది రైలు ప్రమాదాలను నివారిస్తుంది. సబర్మతి -కలోల్, సబర్మతి -సానంద్ మార్గాల్లో రూ.118.83 కోట్లతో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రూ.700 కోట్లతో సబర్మతిలో డబ్ల్యూఏజీ-12 లోకోమోటివ్ మెయింటెనెన్స్ షెడ్‌‌‌‌ను ప్రారంభించారు.12,000 హెచ్‌‌‌‌పీ సామర్థ్యం గల 300 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌‌‌‌ల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది.

రైల్వే భద్రతను మరింత బలోపేతం..

ఈ నూతన ప్రాజెక్ట్‌‌‌‌లు పర్యావరణ పరిరక్షణ సమస్యను పరిష్కరించడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తాయని, రైల్వే భద్రతను మరింత బలోపేతం చేస్తాయని అమిత్ షా పేర్కొన్నారు. ‘భారతీయ రైల్వేలు 2015-–16లో 293 కోట్ల లీటర్ల డీజిల్‌‌‌‌ను వినియోగించగా, 2024–-25 నాటికి అది 108 కోట్లకు తగ్గింది. 2030 నాటికి దీనిని పూర్తిగా సున్నాకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల మన దేశ విదేశీ మారకద్రవ్యం భారీగా ఆదా అవుతుంది’ అని ఆయన వివరించారు.