- బాలాకోట్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు గట్టిగా బదులిచ్చాం
- జనగణన జాతీయ బాధ్యత.. ఆన్‌లైన్‌లో 2.6 కోట్ల మంది నమోదు
- పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
- 138వ మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
న్యూఢిల్లీ: 2016 సర్జికల్ స్ట్రైక్స్ అనేది టెర్రరిస్టుల దాడుకు భారత్ ఇచ్చిన నిర్ణయాత్మక సమాధానమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బాలాకోట్ వైమానిక దాడి నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు టెర్రరిజానికి భారత్ గట్టి సందేశం ఇచ్చిందన్నారు. ఆదివారం ప్రసారమైన 138వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ జనగణనను జాతీయ బాధ్యతగా పేర్కొంటూ, పర్యావరణ పరిరక్షణ, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం, పోషకాహార లోపంపై పోరాటం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.
2016 సెప్టెంబర్ 28–29న భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని మోదీ గుర్తుచేశారు. ఉరి ఉగ్రదాడిలో 18 మంది సైనికులు చనిపోయిన తర్వాత ఈ చర్య చేపట్టారు. గతంలో ప్రతి ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా కాలం గడిచేదని అన్నారు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరులు చనిపోయిన దాడికి ప్రతిగా అదే ఏడాది మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర మౌలిక వసతులపై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
జనగణన.. పర్యావరణం
జనగణన దేశ భవిష్యత్ ప్రణాళికలకు కీలకమని మోదీ చెప్పారు. ఇప్పటివరకు 2.6 కోట్ల మందికి పైగా మొబైల్ ద్వారా స్వీయ నమోదు చేసుకున్నారని, 32 కోట్లకుపైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయని తెలిపారు. హిందీతోపాటు 16 ప్రాంతీయ భాషల్లో ఈ సౌకర్యం ఉందన్నారు. మొదటి దశ దాదాపు పూర్తయిందని, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లోనూ గణన కొనసాగుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అసోంలోని సోనై రూపాయ్ అభయారణ్యంలో ఏనుగులు తిరిగి వచ్చిన విషయాన్ని, పిగ్మీ హాగ్‌ల సంఖ్య ఆరు నుంచి 190కుపైగా పెరిగిన విషయాన్ని చెప్పారు.
సుందర్‌బన్స్‌లో మహిళలు పెంచుతున్న మడ అడవులు గ్రామాలకు రక్షణగా నిలుస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువత చేపట్టిన ‘నషా ముక్త్ యువ అభియాన్’ను ప్రశంసించారు. వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ శతజయంతి సందర్భంగా సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో హాకీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఒలింపిక్ స్వర్ణ పతక విజేత రాజీందర్ సింగ్‌ను అభినందించారు. సెప్టెంబర్ పోషణ్ మాసం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ‘పోషణ్ ట్రాకర్’ ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను ప్రస్తావించారు.
