వణికిస్తున్నడెంగీ..వనపర్తి జిల్లాలో 44 కేసులు నమోదు

వణికిస్తున్నడెంగీ..వనపర్తి జిల్లాలో 44 కేసులు నమోదు

కరోనా వైరస్‌‌తో ప్రపంచం అంతా భయపడుతుంటే వనపర్తి జిల్లా మాత్రం డెంగీతో వణికిపోతోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా రాలేదు కాని 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు ఆయా వార్డుల్లో స్పెషల్‌‌ డ్రైవ్‌‌ నిర్వహిస్తున్నారు. కులాయి, తొట్లలో నిల్వ ఉన్న నీటిని పారబోయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్‌‌ చేయడం, డ్రైనేజీలు, మురికి కాల్వల వద్ద బ్లీచింగ్‌‌ పౌడర్‌‌‌‌ చల్లడం వంటి శానిటేషన్‌‌ కార్యక్రమాలు చేపడుతున్నారు. వైద్య సిబ్బంది ఆయా వార్డుల్లో ఇంటింటి సర్వే చేస్తూ జ్వరం వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు.

చిన్నారులే అధికం

డెంగీ వచ్చిన వారిలో చిన్నారులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. మొత్తం 44 మందికి  ఈ వ్యాధి రాగా ఇందులో 39 మంది చిన్నారులే ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో 41 కేసులు నమోదు కాగా ఇప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మిగిలిన వారిని వనపర్తి, మహబూబ్ నగర్, హైద్రాబాద్ ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీ
పరిధిలోని రాంనగర్ కాలనీ లో కూడా ఓ చిన్నారికి, ఆత్మకూరు బీసీ కాలనీలో, పిన్నంచెర్ల గ్రామంలో మరో ఇద్దరు చిన్నారులకు డెంగీ వచ్చింది. వీరికి వనపర్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కరోనా కట్టడిలో సక్సెస్‌‌ అవుతున్నా..

కరోనా కట్టడి జిల్లా యంత్రాంగం సక్సెస్‌‌ అవుతున్నా.. చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీని పసిగట్టలేకపోయింది. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌‌ కేసు కూడా నమోదు కాలేదు. కానీ, 44 మందికి డెంగీ రావడం కలకలం రేపుతోంది. అయితే ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు డెంగీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

కలెక్టర్‌‌‌‌ ఆదేశాలతో కదిలిన అధికారులు

వారం రోజుల క్రితం అమరచింత మున్సిపాలిటీలో డెంగీతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.  ఆ తర్వాత రోజే మరో 8 మందికి ఈ వ్యాధి సోకింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో కలెక్టర్‌‌‌‌ యాస్మిన్‌‌ బాషా స్వయంగా రంగంలోకి దిగారు. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌‌ అధికారులతో కలిసి అమరచింతలో పర్యటించారు. నల్లా గుంతలు, తొట్లలో నిల్వ ఉన్న నీటిని పారబోయించడంతో పాటు యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఇంటింటికి సర్వే చేసి వివరాలు సేకరించాలని,
మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో శానిటేషన్‌‌ పనులు చేపట్టాలని ఆదేశించారు. మూడ్రోజుల క్రితం వనపర్తి పట్టణంలోని రాంనగర్‌‌‌‌ కాలనీలోనూ ఒకరికి డెంగీ రాగా అక్కడా పర్యటించి వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ వోను కలెక్టర్ ఆదేశించారు.