మెక్సికో లోయలో దారుణం ..45 బ్యాగుల్లో బాడీ పార్ట్స్

మెక్సికో లోయలో దారుణం ..45 బ్యాగుల్లో బాడీ పార్ట్స్
  • కాల్​ సెంటర్ ఉద్యోగులవేనని పోలీసుల అనుమానం
  • వారం రోజుల్లో వేర్వేరుగా మిస్సింగ్ కేసులు నమోదు

మెక్సికో సిటీ: ఉత్తర అమెరికాలోని మెక్సికోలో దారుణం జరిగింది. దేశంలోని పశ్చిమ రాష్ట్రం జాలిస్కోలోని ఓ లోయలో 45 బ్యాగుల్లో ప్యాక్ చేసి, పారేసిన బాడీ పార్ట్స్ దొరికాయి. అవి ఇద్దరు యువతులు, ఐదుగురు యువకులకు చెందిన శరీర అవయవాలు అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. బాడీ పార్ట్స్ దొరికిన లోయకు సమీపంలోని ఓ కాల్ సెంటర్ లో మే 20 నుంచి వారం రోజుల్లో ఏడుగురు ఉద్యోగులు మిస్‌‌ అయినట్లుగా వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయని, వారి కోసం వెతుకుతుంటే మంగళవారం ఈ బాడీ పార్ట్స్ దొరికాయని పోలీసులు గురువారం వెల్లడించారు.

జాలిస్కో రాష్ట్రంలోని గాడలాజరా ఇండస్ట్రియల్ హబ్ ప్రాంతంలోని ఈ లోయ సమీపంలోనే ఓ కాల్ సెంటర్ ఉందని, మిస్ అయిన ఏడుగురు అదే కాల్ సెంటర్​లో పనిచేస్తున్నారని తెలిపారు. అయితే, బాడీ పార్ట్స్​ను ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్స్ పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో కాల్ సెంటర్ నుంచి డ్రగ్స్, రక్తం మరకలు అంటిన తుండుగుడ్డ, క్రిమినల్ యాక్టివిటీస్ కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.అయితే, బాధితులనే క్రిమినల్స్ గా చూపించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మిస్ అయిన యువతీయువకుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.