జూరాల 45 గేట్లు ఓపెన్​

జూరాల 45 గేట్లు ఓపెన్​
  •  భీమా నది నుంచి భారీగా చేరుతున్న వరద

గద్వాల, వెలుగు: జురాల ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద కొనసాగుతోంది. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ లతో పాటు కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది నుంచి కూడా ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శుక్రవారం ప్రాజెక్టు 45 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. మహారాష్ట్రలోని భీమా నదిపై నిర్మించిన ఉజ్జయిని డ్యాం నుంచి కూడా నీటిని విడుదల చేయడంతో అవి కృష్ణా నదికి శుక్రవారం చేరుకున్నాయి. 

దీంతో కర్నాటక నుంచి 2 లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి లక్షా 35 వేల క్యూసెక్కులతో కలిపి 3.35లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో గా నమోదైంది. ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం123.081 టీఎంసీలు కాగా.. 100.933 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 2,01,941 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉంది. 

నారాయణపూర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 33.313 టీఎంసీలకు కాగా..27.330 టీఎంసీల నీటిని నిలువ ఉంచుకొని 25 గేట్లను ఓపెన్ చేసి 2,00,490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. జురాల ప్రాజెక్టులో 4.8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని 45 గేట్లు ఓపెన్  చేసి 3,15,831 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు