సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి

సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి

భూస్వాముల చేతుల్లో, గడీల‌లో మగ్గిపోతున్న అణగారిన వర్గాల‌కు.. స్యేచ్ఛ‌ను, రాజ్యాధికారాన్ని ఇచ్చి ఒక సైన్యాన్ని నిర్మించిన మ‌హా వ్య‌క్తి స‌ర్వాయి పాప‌న్న గౌడ్ అని అన్నారు రేవంత్. అటు భువన గిరి కోట నుంచి గోల్కొండ కోట వరకు త‌న ప‌రాక్ర‌మ జెండా ఎగుర‌వేసిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు. ఆదివారం బోయిన్‌ప‌ల్లిలో ఎంపీ రేవంత్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గౌండ్ల ప్రాముఖ్యత ను గుర్తించేది వారి కుల వృత్తి తో కాదని, వారి పోరాట పటిమను గుర్తుంచుకోవాలని అన్నారు.

‘సర్వాయి పాపన్న చరిత్రను సమైక్య రాష్ట్రం అణిచి వేసిందంటే సీమాంధ్ర పాలకుల వల్లనే అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చి ఇన్ని సంవ‌త్సరాల త‌ర్వాత కూడా గొప్ప గొప్ప చరిత్రకారుల వెలికి తీసి లిఖించాల్సిన‌ అవసరం ఉంది.చరిత్ర కారుల గుర్తింపులో సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యమే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులు లేక కొంతమందికి మాత్రమే గుర్తింపు లభిస్తుందని, సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలన్నారు’ రేవంత్.

స్వామి గౌడ్ గురించి మాట్లాడుతూ… “తెలంగాణ ఉద్యమ పోరాటంలో ప్రముఖంగా ఉన్న వ్యక్తుల్లో స్వామిగౌడ్ ఒకరు. రాజకీయంగా స్వామి గౌడ్ కు, నాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సిద్ధాంతాలు వేరే కావొచ్చు. కానీ ఉద్యమంలో ముందుండి నడిచిన వ్యక్తి స్వామి గౌడ్.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. సమైక్య పాలనలో స్వామిగౌడ్ పై దాడి చేసిన అధికారులే ఇవ్వాళ అందలం ఎక్కిర్రు, ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత తో ఉన్నరు..

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన బడుగు బలహీనవర్గాల బిడ్డ కు ఇవాళ గుర్తింపు ఇవ్వకుండా పక్కకు పెట్టారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వయంపాలన, సామాజిక న్యాయం కోసం మరొక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గా, ఎంపీ గా గెలిచారంటే దానికి గౌడ సోదరులు సహకారం ఎంతో ఉంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.