హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణ కోసం కలిసి పనిచేయడానికి గల అవకాశాలపై కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్), అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) నిర్వాహకులు చర్చించారు. ఇరు సంస్థల ప్రతినిధులు శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ‘ది ఎర్త్ సెంటర్’ అన్మాస్ పల్లిలో సమావేశం అయ్యారు. అటు అమెరికా, ఇటు ఇండియాలో చేపట్టబోయే పర్యావరణ కార్యక్రమాల మీద ప్రాథమికంగా చర్చించారు.
సీజీఆర్ సంస్థ వ్యవస్థాపకుడు కోర్పోలు లక్ష్మారెడ్డి, ప్రెసిడెంట్ లీల లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్టు, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అధ్యక్షత వహించారు. 15 ఏండ్లుగా సీజీఆర్ సంస్థ చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను ‘ఆటా’ ప్రతినిధులకు దిలీప్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్ జయంతి చల్లాతో పాటు సతీశ్ రెడ్డి, పరమేశ్ భీమిరెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, శ్రీధర్ బాణాల, నర్సిరెడ్డి, కాశి కోత, కిషోర్ గూడూరి, రాజ్ కక్కెర్ల, వేణు కోమటిరెడ్డి, ఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
