ఉప సర్పంచ్ పదవి ఇవ్వలేదని కులవృత్తి బంద్

ఉప సర్పంచ్ పదవి ఇవ్వలేదని కులవృత్తి బంద్

నిజాంపేట: మెదక్ జిల్లాలో ఉప సర్పంచ్​పదవి ఇవ్వలేదని దళితులు కుల వృత్తిని బంద్ పెట్టారు. నిజాంపేట మండలం చల్మెడ పంచాయతీ ఏర్పాటు నుంచి ఎస్సీకి రిజర్వ్ కాలేదు. గత ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలని అడిగితే.. వచ్చేసారి చూద్దామని గ్రామ పెద్దలు హామీ ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో సర్పంచ్ బీసీ జనరల్ అయింది. ఈసారైనా ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలని దళితులు మరోసారి కోరగా.. ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో దళితులు బీసీలతో కలిసి బహుజన మహా కూటమి ఏర్పాటు చేసి సర్పంచ్ అభ్యర్థి బీసీ, ఉప సర్పంచ్ పదవి దళితులకు అని తీర్మానించుకుని పోటీ చేశారు.

 అయితే.. కూటమి సర్పంచ్ అభ్యర్థితో పాటు ఏడుగురు వార్డు సభ్యులు ఓడిపోయారు. దీంతో ఉప సర్పంచ్ పదవి ఇస్తే.. సర్పంచ్ కుర్చీ పక్కనే కూర్చుంటే ఎట్లా? ఆ చాన్స్ ఇవ్వమని అవహేళన చేశారని ఆరోపిస్తూ దళితులు శనివారం నుంచి కులవృత్తిని మానుకుంటున్నట్టు తేల్చిచెప్పారు. కావాలనే తమ కూటమి అభ్యర్థులను ఓడించారని ఆరోపించారు. తమకు పదవులు కాదని, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కావాలని పలువురు దళితులు తేల్చిచెప్పారు.